కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీల తయారీ
పోలీసుల అదుపులో నిందితులు...?
సెల్, కంప్యూటర్ దుకాణదారులే సూత్రదారులు
వివరాలు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు
కాణిపాకం(ఐరాల): కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీలను తయారు చేస్తున్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిందితులను కాణిపాకం, స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి సీడీలను చిత్తూరు, తిరుపతికి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడు నుంచి సీడీల దిగుమతి
కాణిపాకం అటు తమిళనాడుకు ఇరవై కిలోమీటర్లు, కర్ణాటకకు యాభై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడున్న సెల్, కంప్యూటర్ దుకాణదారులు సీడీలను చెన్నై, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరుతోపాటు, కాణిపాకానికి కొత్త సినిమా వచ్చిన గంటల వ్యవధిలోనే వాటి ప్రింట్‌లు సెల్ షాపు, కేఫ్‌ల్లోకి చేరిపోతున్నాయి. ఇక్కడి నుంచి మెయిల్, వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా జిల్లా, రాష్ట్రం నలుమూలలకు క్షణాల్లో చేరిపోతున్నాయి. అలాగే సీడీలు, డీవీడీలుగా మార్చి చిత్తూరు, తిరుపతి, పలమనేరు పట్టణాలకు చేరవేస్తున్నారు.
థియేటర్ సిబ్బందితో సత్సంబందాలు
కాణిపాకం, చిత్తూరుకు చెందిన థియేటర్ సిబ్బందితో సంబందాలు కలిగిన కొందరు వ్యక్తులు కొత్త సినిమా వచ్చిన వెంటనే పైరసీ తయారీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా తీసిన ప్రింట్‌ను నాణ్యతను బట్టి రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పైరసీ తయారీదారులకు విక్రయిస్తున్నారు.
ఫ్యాన్స్ చేతికి చిక్కిన సందర్బాలు ఉన్నాయి
కాణిపాకం సినిమా థియేటర్‌లో ఇటీవల కొందరు వ్యక్తులు సెల్ కెమెరాల్లో కొత్త సినిమా రికార్డు చేస్తుండగా ఫ్యాన్స్ పట్టుకున్నారు. వారిని థియేటర్ యజమానులు అదుపులోకి తీసుకొని వారించి పంపేశారు. అలాగే మొబైల్స్‌ను తీసుకొని సినిమా విజువల్స్‌ను తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. వీటిపై ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు
పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. సినిమా చట్టం ప్రకారం పైరసీ సీడీలు, డీవీడీలను తయారు చేసిన వా రు, కొనుగోలు చేసిన వారు కూడా శిక్షార్హులే. వారిని ఉపేక్షించేది లేదు. అభిమానులు ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. సెల్ షాపులు, కంప్యూటర్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. – ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ