సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో కోదండరామిరెడ్డి తదితర అధికారులు
– ఏర్పాట్లపై అధికారులకు ఆర్డీవో సూచనలు
– విజయవంతం చేయాలని ఆదేశాలు
కాణిపాకం(ఐరాల): కాణిపాకంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి నిర్వహించనున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీవో కోదండరామిరెడ్డి అన్నారు. సోమవారం కాణిపాకంలోని ఆలయ గెస్ట్ హౌస్‌లో అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వసతి సౌకర్యాల కల్పనకు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,సిబ్బంది కృషి చేయాలన్నారు. పూతలపట్టు నుంచి కాణిపాకం వరకు రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. భక్తులకు అత్యవసర సేవల్లో భాగంగా ఆలయం వద్ద 24గంటలు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని,108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. తాగునీటి వసతి కల్పించాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు ప్రతి ఐదు నిమిషాలకు బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాలు జరిగే 21 రోజులు మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వామి వారి ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఈవో పూర్ణచంద్రరావు,ఉభయదారుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు లత, కాణిపాకం సర్పంచ్ మధుసుధన్ రావు, డెప్యూటీ తహశీల్దార్ నరేష్ బాబు , ఎంపీడీవో పార్వతమ్మ,ఆలయ అదనపు ఈఈ మురళి బాలకృష్ణæ, ఏఈవోలు కేశవరావు, సూపరింటెండెంట్లు రవీంద్ర,స్వాములు,ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వర గురుకుల్, 14 గ్రామాల ఉభయదారులు పాల్గొన్నారు.