‘బాబు’ అబద్దాల సంకల్పం
‘బాబు’ అబద్దాల సంకల్పం
Published Fri, Jun 9 2017 11:05 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
ఇచ్చిన మాటేమిటి? చేసిందేమిటి?
రైతు రుణమాఫీపై మాట తప్పారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
సాక్షిప్రతినిధి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలనే తిప్పి తిప్పి ఇస్తూ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో గురువారం మహాసంకల్ప దీక్షలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పుకుంటూ పోయారన్నారు. కాకినాడలో శుక్రవారం కన్నబాబు విలేకర్లతో మాట్లాడుతూ మహాసంకల్ప సభలో చంద్రబాబు మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశానని సంకల్పదీక్ష సాక్షిగా బాబు అబద్దాలు వల్లెవేశారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులకు ఎన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు, ఎన్ని కోట్లు మాఫీ చేశారో, రైతులను ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియంది కాదన్నారు. నిరుద్యోగ భృతి హామీని ఇప్పటికీ నెరవేర్చకపోగా కాకినాడ మహాసంకల్పంలో మరోసారి హామీ ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. రుణాలు చెల్లించవద్దంటూ ఊరూవాడ డప్పేసి చెప్పి తీరా గద్దెనెక్కాక డ్వాక్రా మహిళలకు కేవలం రూ.3వేలు, రూ.6వేలు ముట్టచెప్పి చేతులు దులిపేసుకున్న బాబుకు మహాసంకల్పం చేసే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలకు కొత్తగా ఏదో చేస్తున్నట్టు గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు తెరతీస్తున్నారన్నారు.
కాకినాడ మెయిన్‌రోడ్డులో అంబులెన్స్‌ను నిలిపివేసి మరీ చంద్రబాబు పర్యటించడం చూస్తే అసలు ఈ ముఖ్యమంత్రికి మానవత్వం అంటూ ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అంబులెన్స్ వస్తుందంటే కనీసం అక్షరం ముక్కరాని వారు కూడా పక్కకు తప్పుకుని మార్గం ఇస్తారన్నారు. చంద్రబాబుకు వీఐపీ ట్రీట్‌మెంట్ తప్ప ఇటువంటి విషయాలు తెలియవా అని కన్నబాబు ప్రశ్నించారు.
Advertisement
Advertisement