తుని ఘటనలో అరెస్టైన ముగ్గురు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు.
రాజమహేంద్రవరం: తుని ఘటనలో అరెస్టైన ముగ్గురు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి వారు నేరుగా కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు యత్నించారు. ఇంతలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు కాపు నేతలు జైలు వద్ద బైఠాయించినట్టు సమాచారం.
కాకినాడ నాలుగో అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్‌చార్జి అదనపు జిల్లా జడ్జి బి.గాయత్రి సోమవారం ఈ ముగ్గురు కాపు నేతలకు బెయిల్ మంజూరు చేయగా, సాంకేతిక కారణాలవల్ల వారు ఈ రోజు విడుదల అయ్యారు. తుని ఘటనలో అరెస్టైన వారిలో మొత్తం 13 మంది బెయిల్ పై విడుదలయ్యారు.
కాగా, తుని ఘటనల్లో అరెస్టు చేసిన 13 మందినీ విడుదల చేయాలన్న డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం 13వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే.