
బాబు డొల్లతనం బట్టబయలు
ప్రభుత్వ పనితీరు, నిధుల వ్యయంపై కాగ్ విడుదల చేసిన నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబు డొల్లతనం బట్టబయలైపోయిందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్
ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం
గుమ్మఘట్ట (రాయదుర్గం) : ప్రభుత్వ పనితీరు, నిధుల వ్యయంపై కాగ్ విడుదల చేసిన నివేదికతో ముఖ్యమంత్రి చంద్రబాబు డొల్లతనం బట్టబయలైపోయిందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలం పూలకుంటలో సర్పంచ్ ముసలిరెడ్డి స్వగృహంలో శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదవరెడ్డి, యువజన విభాగం స్టీరింగ్ జిల్లా కమిటీ సభ్యులు బోర్‌వెల్ నాగిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందుతో కలసి కాపు రామచంద్రారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో రైతులను వచించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2015–16 బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు కేటాయిస్తే, రూ.743.52 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. ఇందులోనూ రూ.375 కోట్లు మాత్రమే సర్ధుబాటు చేసి రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
కరువు కరాళనృత్యం చేస్తుంటే ఆదుకోవాల్సింది పోయి విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా అవినీతిలో నంబర్–1గా నిలిపారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెంపులోనూ ప్రభుత్వం అనుసరించిన అక్రమ పద్ధతులను కాగ్ తప్పుపట్టిందన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కాగ్ నివేదిక ఆధారంగా సీబీఐ లేదా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మరెక్కడా లేనంతగా రాయదుర్గం నియోజకవర్గంలో నీరు–చెట్టు పనుల్లో అవినీతి చోటుచేసుకుందని, విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటివి సకాలంలో చెల్లించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రూ.కోట్లు గుమ్మరించిన వారికే మంత్రివర్గ విస్తరణలో పదవులు కేటాయిస్తున్నారని, సొంత పార్టీలోనే ఈ విమర్శ వ్యక్తమవుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు పూలకుంట సుధాకర్‌రెడ్డి, బడిగే గంగప్ప, నాగప్ప, పైతోట రఘు, పవన్ తదితరులు పాల్గొన్నారు.