సాకులు చెప్పి తప్పించుకోకు | Kapu Ramachandra Reddy Slams Kaluva Srinivasulu In Rayadurgam | Sakshi
Sakshi News home page

సాకులు చెప్పి తప్పించుకోకు

Published Sat, Sep 15 2018 10:02 AM | Last Updated on Sat, Sep 15 2018 10:02 AM

Kapu Ramachandra Reddy Slams Kaluva Srinivasulu In Rayadurgam - Sakshi

అనుచరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న కాపు రామచంద్రారెడ్డి

రాయదుర్గం : మంత్రి కాలవ శ్రీనివాసులు కుంటిసాకులు వీడి.. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. రాయదుర్గంలోని తన స్వగృహంలో  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడారు. ‘పరిమిత సంఖ్యలో రావాలని నోటీసులతో పోలీసులను మంత్రి కాలవ గురువారం రాత్రి మా ఇంటికి పంపారు. పరిమిత సంఖ్య అయితే అది బహిరంగ చర్చ ఎలా అవుతుందని’  కాపు ప్రశ్నించారు. తేదీ ఖరారు చేసిన మంత్రి కాలవ.. డీఎస్పీకి అనుమతి కోరిన లేఖలో ఇరువైపులా పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వాలని, తన తరఫున శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకోవాలని రాయడం ఎంతవరకు సమంజసమని అన్నారు.

బహిరంగ చర్చ అంటే అభివృద్ధిపైన గానీ అవినీతిపైన గానీ ఒక్కో అంశంపై ప్రజల సమక్షంలో చర్చించడమే బహిరంగ చర్చ అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు ప్రజలను తరలించడానికి   సామర్థ్యం లేదని మంత్రి చెప్పడం సరికాదని, ప్రజలను తరలించాల్సి న అవసరం లేదని, ప్రజలే ఆసక్తిగా తరలివస్తారని సూ చించారు.  రాయదుర్గం ప్రజలు శాంతికాముకులు అనే విషయం నీకు తెలియదా? అని కాపు ప్రశ్నించారు.    

 

సమయం లేదు మిత్రమా..
మంత్రి కాలవ శ్రీనివాసులు గత ఎన్నికలకు 15 రోజుల ముందు దుస్తులు సర్దుకొని రాయదుర్గం వస్తే .. ఆయన అందం చూసి ప్రజలు ఓటువేసి గెలిపించలేదని కాపు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను నమ్మారని, ఈయన కూడా  ప్రచారం చేయడంతోనే గెలిపించారన్నారు. అవే అంశాలపై చర్చించడానికి ఒప్పుకోకపోవడం ఎంత వరకు సబబన్నారు. కాలవ ఎంపీగా వున్న సమయంలో దుర్గం అభివృద్ధికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.  2002లో హెచ్చెల్సీ నీటి కోసం జరిగిన ఉద్యమంలో రైతులపై కేసులు పెడితే,  ఇటు వైపు తిరిగి చూడని నీవు రైతులకు ఏమిలబ్ధి చేకూర్చావని నిలదీశారు. సమయంలేదు మిత్ర మా... పోలీసులతో అనుమతి తీసుకో... చర్చించడానికి మేము వస్తున్నాం’ అని తెలిపారు.

కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, బీసీ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎన్టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా అధికార ప్రతి నిధి మాధవరెడ్డి, మండల కన్వీనర్లు మలి ్లకార్జున, కాంతారెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, ఈశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ గోనబావి శర్మస్, పట్టణ ప్రచార కార్యదర్శులు పైతోట సంజీవ, హనుమంతు, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాసులు, సీతారం, బాబు, గిడ్డరాము, నాయకులు ముల్లంగి నారాయణ స్వామి, ఎంసీహెచ్‌ రాజ్‌కుమార్‌ , కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి, లక్ష్మిరెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, బేలోడు రామాంజనేయులు, తిమ్మప్ప, సత్తి  పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో కాపు
డి.హీరేహాళ్‌ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాయదుర్గం వస్తున్న కాపు రామచంద్రారెడ్డిని మల్లాపురం రోడ్డు సమీపాన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగా ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోవడమేంటని కాపు ప్రశ్నించారు. అవసరమైతే గృహనిర్బంధం చేసుకోండి.. ఇలా నియోజకవర్గం దాటించాలని చూస్తే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారన్నారు. అయితే పోలీసులు అందుకు ససేమిరా అన్నారు.   

పరిమిత సభ్యుల మధ్య చర్చిద్దాం: మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం :  2014 నుంచి ఇప్పటి వరకు దుర్గం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి , అవినీతిపై బహిరంగంగా చర్చిద్దామని చెప్పిన మాట వాస్తవమే.. వేలాది మంది ప్రజల మధ్య చర్చ పెడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు చెప్తున్నారని, పరిమిత సభ్యులతో చర్చించడానికి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావాలని మంత్రి కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధితో పాటు టీడీపీ మేనిఫెస్టోపై చర్చిద్దామని చెప్పడం భావ్యం కాదన్నారు. 

కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా వున్న 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు నా హయాంలో జరిగిన అబివృద్ధిపై మాత్రమే చర్చిద్దామన్నారు. ఇది రాజకీయ చర్చ కాదని ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ అన్నారు. మా మధ్యలో సంధానకర్తగా మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌ ఉంటారని తెలిపారు.  పరిమిత సంఖ్యలో అర్థవంతమైన చర్చ చేయడానికి రామచంద్రారెడ్డి రావాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటేశులు, మురడి ఆనంద్‌రెడ్డి, మల్లికార్జున, నాగళ్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement