ఘనంగా కేసీపీ వజ్రోత్సవ వేడుకలు
ఉయ్యూరు : కేసీపీ సేవలు నిరుపమానమని అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ జీ రామచంద్రనాయుడు అన్నారు. స్థానిక కేసీపీ కర్మాగార ఆవరణలో బుధవారం వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రనాయుడు మాట్లాడుతూ కార్మిక, కర్షక, యాజమాన్యం ఐక్యతతో ముందుకు నడుస్తూ 75 ఏళ్లు కర్మాగారాన్ని ప్రజా ఆమోద్య యోగ్యంతో నడపడం దేశ చరిత్రలోనే గుర్తుంచుకోదగ్గ విషయమన్నారు. ఏబీఎన్ ఎండీ వి. రాధాకృష్ణ మాట్లాడుతూ లాభాపేక్షతో కాకుండా సామాజిక స్ఫూర్తితో యాజమాన్యం పనిచేయడం ఆదర్శనీయమన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులజాడ్యం పోవాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమం, మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారాల్సి ఉందన్నారు. కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ సంస్థ ప్రగతి, రైతు సంక్షేమం, సామాజిక అభివృద్ధి అంశాలను వివరించారు. ఉత్తమ రైతులు, కార్మికులు, ఉద్యోగులను సన్మానించి బంగారు, వెండి పతకాలను అందించారు. రిటైర్డ్ ఉద్యోగ కార్మికులను సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందించారు. విద్యార్థులు, పలువురు పేదలకు ఆర్ధిక సాయం చేశారు. ముందుగా రోటరీ కంటి ఆస్పత్రి, వృద్ధాశ్రమాన్ని అతిథులు సందర్శించి పండ్లు అందజేశారు.
ఆకట్టుకున్న ఎగ్జిబిషన్..
వజ్రోత్సవాల సందర్భంగా కర్మాగార ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. చెరుకు వంగడాలతోపాటు వ్యవసాయ యంత్రాలు, పశువులు, గొర్రెలు, కోళ్లను రైతులు ఆసక్తిగా తిలకించి సమాచారం తెలుసుకున్నారు. పుంగనూరు జాతి ఎడ్లు, ఆవులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల జాతి కోళ్లు ఆకట్టుకున్నాయి.
ఆదర్శప్రాయుడు మారుతీరావు
ఉయ్యూరు : కేసీపీ కర్మాగారంలో సాంకేతిక మార్పులను తీసుకువచ్చి నాణ్యతకు పెద్దపీట వేసి కార్మిక, కర్షక సంక్షేమానికి కృషిచేసిన మహనీయులు మారుతీరావు ఆదర్శప్రాయులని అవధాని మాడుగుల నాగఫణిశర్మ కొనియాడారు. స్థానిక కేసీపీ కర్మాగారంలో స్వర్గీయ వెలగపూడి మారుతీరావు 84వ జయంతి, నాణ్యతా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మారుతీరావు విగ్రహానికి నాగఫణిశర్మ, యాజమాన్యం పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. నాణ్యతా దినోత్సవ సభలో ఉత్తమ కార్మికులకు బంగారు, వెండి పతకాలను అందించి సత్కరించారు. పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కేసీపీ ఎండీ ఇర్మ్‌గార్డ్ వెలగపూడి, చైర్మన్ వినోద్ ఆర్ సేథీ, ఇడీ కిరణ్‌రావు, సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), సీకే వసంతరావు (ఫైనాన్స్), శ్రీహరిబాబు (ప్రాసెస్), సీతారామారావు (ఇంజనీరింగ్), కే కృష్ణ (అడ్వైజర్), హెచ్‌ఆర్ మేనేజర్ దాస్, తదితరులు పాల్గొన్నారు.