
సీబీఐ విచారణపై గోప్యమెందుకు?
సూర్యనారాయణతో కేసీఆర్ అనుబంధం వెల్లడించాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యవహరించిన తీరుపై సీబీఐ 3 గంటల పాటు విచారణ జరిపితే ఆ వివరాలను సీఎం కార్యాలయం ఎందుకు గోప్యంగా ఉంచిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ- 1 ప్రభుత్వంలో కేంద్ర కార్మిక మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్‌ను ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించినట్లు తమకు సమాచారం ఉందని, దీనిపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ భవన్‌లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌బీసీసీకి కేటాయించిన ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం కాంట్రాక్ట్‌ను ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణ ఆధ్వర్యంలోని మత్స్యశాఖకు కేసీఆర్ కేటాయించారని అన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో కేసీఆర్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వ్యక్తే సీబీఐకి చెప్పినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ కృతజ్ఞతతోనే వెలుగుబంటి టీఆర్‌ఎస్ భవన్ నిర్మాణంలో కేసీఆర్‌కు సహకరించారని ఆరోపించారు. సూర్యనారాయణతో కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ నేతలకు ఉన్న అనుబంధం ఏంటో రాష్ట్ర ప్రజలకు వివరించాలని రేవంత్ డిమాండ్ చేశారు.