కేసీఆర్ దళితులను మభ్యపెడుతున్నారు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: ఎన్నికల ముందు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తరువాత హామీ నెరవేర్చకుండా దళితులను మభ్యపెడుతున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి చౌరస్తాలో ఉన్న భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దళితులకు భూమి కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పేదలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు జనరల్ కేటగిరీ స్థానాల్లో కూడా అత్యధిక సీట్లు దళితులకు కేటాయించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, ఆచారి, దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతం, రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు, ప్రధాన కార్యదర్శి పరమేశ్‌కుమార్, కోశాధికారి హరిబాబు, కార్యదర్శి రాంచందర్, నాయకులు డి.నరహరి, మహేశ్, గంగరాజు పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.