కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
– బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు
చిట్యాల: రజకార్ల వారసులు ఎంఐఎం పార్టీ నాయకులకు తలొగ్గి సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. చిట్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విమోచనం ఆనంతరం కర్ణాటకలో కలిసిన ప్రాంతాల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో మాత్రం నిర్వహించడం లేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామన్నారు. ప్రధాన మంత్రి మోదీ జన్మదినం సందర్భంగా శనివారం బీజేపీ నాయకులు స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్‌లో శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ పాపయ్య, నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావు, ఆ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాస శ్రీనివాస్, పల్లె వెంకన్న, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు పాల్గొన్నారు.