కిరో‘సీన్’
ఏలూరు (మెట్రో) : వచ్చే నెల నుంచి రేషన్ కార్డులపై కిరోసిన్ పంపిణీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అదునుగా డీలర్లు బరితెగించారు. మే నెల కోటాగా జిల్లాకు విడుదలైన కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. జిల్లాలోని 2,040 రేషన్ షాపుల ద్వారా మే నెలలో 1,243 కిలోలీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 759 కిలోలీటర్లు మాత్రమే విడుదల చేసింది. అందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామంటూ ఈ నెల కిరోసిన్ కోటాలో 40 శాతం కోత విధించారు.
559 కిలోలీటర్లు బ్లాక్ మార్కెట్‌కు..
వచ్చే నెల నుంచి కిరోసిన్ పంపిణీ నిలిచిపోనుండటంతో ఇదే చివరి అవకాశంగా భావించిన డీలర్లు సుమారు 559 కిలోలీటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. కార్డుదారుకు లీటర్ రూ.19కి ఇవ్వాల్సిన ఈ కిరోసిన్‌ను రూ.40 నుంచి రూ.50 చొప్పున ధర కట్టి నల్లబజారుకు తరలించారు. జిల్లాకు 759 కిలోలీటర్లు విడుదల కాగా.. ఇందులో 200 కిలో లీటర్లు కూడా వినియోగదారులకు చేరలేదు. కార్డుదారులు రేషన్ డిపోలకు వెళ్లి కిరోసిన్ అడిగితే.. మే నెల నుంచే పంపిణీ నిలిచిపోయిందని అడ్డంగా బొంకారు. బియ్యం, పంచదార తీసుకున్న సమయంలోనే కిరోసిన్ కూడా తీసుకున్నట్టు ఈపోస్ యంత్రాల్లో నమోదు చేసి దొడ్డిదారిన నల్లబజారుకు తరలించారు.
వంతపాడిన పౌర సరఫరాల శాఖ !
రేషన్ డీలర్ల వద్ద నుంచి ప్రతినెలా కాసులకు కక్కుర్తి పడుతున్న పౌర సరఫరాల శాఖ ఈ నెలలో కనీసం రేషన్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కిరోసిన్ ఇవ్వడం లేదని కార్డుదారులు బహిరంగంగా చెబుతున్నా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు. కిరోసిన్ కోటాకు సైతం పౌర సరఫరాల అధికారులకు ముడుపులు అందిన కారణంగానే మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు నిర్వహిస్తున్నాం
కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి అక్రమాలు లేవు. కిరోసిన్ నల్లబజారుకు తరలిందనేది అవాస్తవం.
– సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాల అధికారి