కిరోసిన్ మంటలు!
కిరోసిన్ మంటలు!
Published Thu, Nov 3 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
లీటర్‌పై రూ.4ల పెంపు
ప్రతి నెలా రూ.27,26,804 భారం
ఆందోళనలో కార్డుదారులు
కోడుమూరు రూరల్ : ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్ ధరను లీటర్‌పై రూ.4లను పెంచింది. గ్యాస్ కనెక‌్షన్ ఉన్న కార్డుదారుడు ప్రస్తుతం లీటర్ రూ.15 ఇస్తుండగా, ఇక నుంచి రూ.19 చెల్లించాల్సి ఉంది. గ్యాస్ కనెక‌్షన్ ఉన్న కార్డుదారుడికి ఒక లీటర్, లేని వారికి 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్యాస్ కనెక‌్షన్ లేని వారికి 4 లీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కార్డుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నవంబర్ కోటా నుంచి అమలు
గ్యాస్ కనెక‌్షన్ ఉన్న రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే కిరోసిన్‌పై ధర పెంపును నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 10,77,525 రేషన్‌కార్డులుండగా, ఇందులో గ్యాస్ కనెక‌్షన్ ఉన్న కార్డుదారులు 6,81,701 ఉండగా, కనెక‌్షన్ లేని వారు 3,95,824 ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా గ్యాస్ కనెక‌్షన్ ఉన్న కార్డుదారులపై రూ.27,26,804 భారం పడనుంది. దీంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
పెంచిన ధరలను తగ్గించాలి
కార్డుదారులకు కిరోసిన్ ధరలను పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ఇబ్బందుల పడుతున్న ప్రజలపై మరింత భారం మోపడం మంచిది కాదు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. -కృష్ణ, సీపీఐ తాలుకా కార్యదర్శి, కోడుమూరు
ఈనెల నుంచే అమలు
కిరోసిన్ ధర పెరుగుదల ఈ నెల నుంచే అమలవుతుంది. గ్యాస్ కనెక‌్షన్ లేని కార్డుదారులకు రూ.15లకే లీటర్ పంపిణీ చేస్తాం. -నిత్యానందరాజు, తహసీల్దార్, కోడుమూరు
Advertisement
Advertisement