- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వ్యవసాయ సంక్షోభం
- నేడు రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ధర్నా
- మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరం టౌన్ : వ్యవసాయమన్నా, రైతులన్నా చంద్రబాబుకు గిట్టదని, ఆయన రైతు ద్వేషి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. బాబు పాలనలో నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైందన్నారు. ఆదివారం స్థానిక ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వ తేదీ సోమవారం వైఎస్సార్‌సీపీ «ఆధ్వర్యంలో బత్తలపల్లి మండలం నుంచి ధర్మవరం వరకు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వరుస కరువులతో రైతులు అల్లాడిపోతున్నారని, గ్రామాల్లో పనులు దొరక్క రైతులు కుటుంబాలతో సహా కేరళ, బెంగళూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత దయనీయమైన పరిస్థితులు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించకుండా రెయిన్‌గన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆరునెలల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే పంట నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అది అమలుకు నోచుకోకపోవడం చూస్తే రైతుల విషయంలో ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందన్నారు. రుణమాఫీ హామీ అమలుకాకపోవడంతో రైతులు పంట రుణాల వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకున్నారని, అధిక వడ్డీలు భరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విచారం వెలిబుచ్చారు. ఈ పాలకులు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతన్నలకు తీరని అన్యాయం చేశారని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
రైతు ద్వేషి చంద్రబాబు
Published Sun, Apr 16 2017 11:08 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
Advertisement
Advertisement