- సీఎం మోసపూరిత నిర్ణయంతో అన్యాయం
- ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వేర్వేరుగా ఇవ్వాలి
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరం టౌన్ : వాతావరణ బీమా పరిహారాన్ని ఇన్‌పుట్ సబ్సిడీకి జత చేసి రైతులకు అందిస్తానని చెప్పడం సీఎం చంద్రబాబు చేస్తున్న మరో మోసానికి నిదర్శనం. ఈ విషయంలో రైతులకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ మూడేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావంతో రైతాంగం కుదేలైందన్నారు. ప్రతి సంవత్సరం జిల్లాకు రావడం.. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తానని చెప్పడం..అనంతరం మొహం చాటేయడం సీఎంకు అలవాటైందన్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 15.15 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగను సాగు చేశారన్నారు.
మరో నాలుగు లక్షల ఎకరాల్లో కంది, ఆముదం తదితర పంటలను రైతులు సాగు చేశారన్నారు. ప్రభుత్వం గత ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.19,500గా నిర్ణయించిందని.. రైతులు ఆ నిబంధన ప్రకారం వాతావరణ బీమా ప్రీమియాన్ని ఎకరాకు రూ.500 చొప్పున మొత్తం రూ.350 కోట్లు బీమా కంపెనీకి చెల్లించారన్నారు. అయితే తీవ్ర వర్షాభావం కారణంగా పంట దారుణంగా దెబ్బతిందన్నారు. దీంతో 63 మండలాలలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లాలో 15.15 లక్షల ఎకరాలకు గానూ రూ.3,500 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేస్తే.. బీమా కంపెనీ నష్ట పరిహారాన్ని కేవలం రూ.419 కోట్లు విడుదల చేసిందన్నారు. ఏదో ప్రభుత్వం అన్నా రైతులను ఆదుకుంటుందని భావిస్తే రూ.1032.69 కోట్లు విడుదల చేస్తుందని ప్రకటన చేసిందన్నారు.
నయా మోసానికి తెర..
ప్రస్తుతం ఆ పరిహారం కూడా వాతావారణ బీమాకు అనుస«ంధానం చేసి ఆనిధులతో పాటు రైతులకు చెల్లించేలా ప్రభుత్వం మరో మోసానికి తెరలేపడం దారుణమన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ అనేది కేంద్రం సగ భాగం, రాష్ట్రం సగభాగం భరించాలి. అయితే పంట నష్ట పరిహారాన్ని రాష్ట్రం తమ వాటా విడుదల చేయకుండా బీమా కంపెనీ విడుదల చేసిన నిధులు, కేంద్రం విడుదల చేసిన నిధులు, ఫసల్ బీమా ద్వారా వచ్చిన పంట నష్ట పరిహారం రూ.37 కోట్లకు కేవలం రూ.67 కోట్లు నిధులను జత చేసి రైతులకు అందించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. దేశ చరిత్రలో ఇలా రైతాంగాన్ని మోసం చేయాలనే ప్లాన్ ఇంత వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. బీమా పరిహారం అనేది రైతులు చెల్లించిన ప్రీమియం కంపెనీ ఇచ్చే పరిహారం అది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమన్నారు.
అంతేకాక ప్రభుత్వం బీమా కంపెనీ విడుదల చేసిన నిధులను రైతుల ఖాతాలో జమ చేయకుండా అడ్డుకోవడం మరో మోసమన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే రైతుల ఖాతాలో బీమా పరిహారం నిధులు విడుదల చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వ వైఖరి కారణంగానే జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసం కారణంగా అటు వ్యవసాయశాఖ అధికారులు, ఇటు బీమా కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అందరూ చట్టపరిధిలో శిక్షార్హులే అవుతారన్నారు. నేడు ఏరువాకకు జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా ఈ మోసపూరిత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను కేంద్రం, రాష్ట్రం వాటాలతో మాత్రమే అందించాలన్నారు. లేని పక్షంలో తాము కోర్టుకు వెళ్లి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతాంగాన్ని మోసం చేసే ఇలాంటి పనులు ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.
రైతులకు న్యాయం జరక్కపోతే కోర్టుకెళ్తాం
Published Thu, Jun 8 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
Advertisement
Advertisement