హంసవాహనంపై ఖాద్రీ లక్ష్మీ నృసింహుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి గురువారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ తన భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. భక్త జనుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారు విద్యల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులను కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంరాలు ధరించిన స్వామివారు తిరువీధుల్లో ఊరేగారు. పాలు, నీళ్లు వేరు చేసినట్లే గుణా వగుణ విచక్షణా ఙ్ఞానానికి సంకేతం హంస. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోలుస్తారు. అలాంటి హంసపై పరమహంస అయిన లక్ష్మీనారసింహుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్చమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెప్పారని భక్తుల ప్రతీతి. ఆలయానికి కాలినడకన రాలేకపోతున్న భక్తుల కోసం స్వామివారే తన భక్తుల చెంతకు వచ్చారని ప్ర«ధాన అర్చకులు వివరించారు. తిరువీధుల గుండా స్వామివారిని చూసేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పూజలు నిర్వహించారు. ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్‌శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.