రేపటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
-
13జిల్లాల నుంచి 300మంది క్రీడాకారుల రాక
-
పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నెల్లూరు(బృందావనం) : నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అక్టోబరు ఒకటి నుంచి మూడో తేదీ వరకు రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల ఖోఖో పోటీలు జరుగుతాయని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జిలానీబాష, గురుప్రసాద్ తెలిపారు. స్టేడియంలోని ఖోఖో క్రీడాప్రాంగణంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 13 పురుషుల జట్లకు సంబంధించి 156 మంది, 13 మహిళల జట్లుకు సంబంధించి 156 మంది క్రీడాకారులు, వీరితో పాటు 50 మంది అధికారులు, 100 మంది పీఈటీలు, సిబ్బంది రానున్నారన్నారు. క్రీడాకారిణులకు స్థానిక డీకేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాలలో, పురుషులకు కొండాయపాలెంరోడ్డులోని సెయింట్ ఇన్ఫాంట్æజీసస్ స్కూల్ ప్రాంగణంలో బస ఏర్పాటుచేశామన్నారు. మూడురోజులు జరిగే పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలను ప్రముఖ కాంట్రాక్టర్, జిల్లా ఖోఖో సంఘం చీఫ్‌ప్యాట్రన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్ ట్రస్ట్, హైదరాబాద్‌కు చెందిన వాటర్ ప్యూరిఫైర్ సంస్థ శ్రేష్ట సంస్థ సహకారంతో కల్పిస్తున్నామన్నారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారులతో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లును ఎంపికచేస్తామన్నారు. ఎంపికైన క్రీడాకారులతో రాష్ట్ర జట్లు అక్టోబరు చివరివారంలో నాగపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి సనత్‌కుమార్, పాల్గొన్నారు.