ఖోఖో కాదు..కోకో
తమిళసినిమా: ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించాలంటే కోలీవుడ్‌లో నయనతార, టాలీవుడ్లో అనుష్కలే ముందు గుర్తుకొస్తారని చెప్పవచ్చు. అలాంటిది అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉంది. తను పెళ్లికి రెడీ అవుతోందని, అందుకే కొత్త చిత్రాలు అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజాలేమిటన్నది అనుష్క నోరు విప్పితే కానీ తెలియదు. నయనతార మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఈమె గురించి పెళ్లి వార్తలు కాదుగానీ, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్న ప్రచారం మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే నయనతార చేతి నిండా చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉంది.
మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వరుసగా నయనతార తలుపు తడుతున్నాయి. మధ్యలో డోర చిత్రం నిరాశపరచినా, నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ వంటి కమర్శియల్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు, మలయాళంలో నవీన్పాల్తో ఒక చిత్రం చేస్తోంది. వీటిలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన వేలైక్కారన్ చిత్రం వచ్చే నెల 29న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.
తాజాగా నయనతార మరో కథానాయకి పాత్ర చుట్టూ తిరిగే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. బ్లాక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి ఖోఖో అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరగడంతో ఇదేదో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం అని చాలా మంది భావించారు. నిజానికి ఈ చిత్ర టైటిల్ ఖోఖో కాదట. కోకో అట. కోకో అంటే కోలమావు కోకిల అట. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార చిత్రానికి ఈయన సంగీత బాణీలు కట్టడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.