heroine oriented movie
-
100 కోట్ల క్లబ్లో చేరిన మహిళా ప్రాధాన్యత చిత్రాలు ఇవే..
Heroine Oriented Movies That Crossed 100 Crore In Bollywood: హీరో ఒరియెంటెడ్ మూవీస్ సాధారణమే. అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా హిట్ కొట్టడం పరిపాటే. కానీ మహిళా ప్రాధాన్యతతో వచ్చే సినిమాలు తక్కువే. ఒకవేళ వచ్చిన హిట్ కొట్టడం అంతా ఈజీ కాదు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వారి చరిష్మా, నైపుణ్యం వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. అయితే ఇటీవల 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియా భట్ నటించిన హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రం 'గంగుబాయి కతియావాడి'. ఈ సినిమాలో అలియా తన అందం, అభినయం, డైలాగ్‌లతో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్‌వైడ్ కలెక్షన్లతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ. 100 కోట్ల మార్క్ దాటిన మహిళా ప్రాధాన్యత గల పలు బాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా ! 1. గంగుబాయి కతియవాడి- వారం రోజుల్లో రూ. 100 కోట్ల కలెక్షన్లు 2. తను వెడ్స్ మను రిటర్న్స్ - రూ. 255.3 కోట్లు 3. రాజీ- రూ. 195 కోట్లు 4. నీర్జా- రూ. 131 కోట్లు 5. స్త్రీ- రూ. 130 కోట్లు -
నయన్‌ది ఆశా? అత్యాశా?
సినిమా: మనిషి అన్నాక కాసింతైనా ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార అత్యాశకు పోతోందని చిత్ర వర్గాల గుసగుసలు. చేతి నిండా సినిమాలతో సూపర్‌స్టార్స్ నుంచి యువస్టార్స్ వరకూ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది నయనతార. అంతే కాదు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతోను మెప్పించేస్తోంది. నటిగా దశాబ్ద కాలం అధిగమించిన తరువాత ఈ అమ్మడు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఐరా. ఇందులో రెండు పాత్రల్లోనూ నటనలోనూ, గెటప్లోనూ ఎంతో వైవిధ్యం చూపించినట్లు చిత్ర ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఈ నెల 28వ తేదీన తెరపైకి రావడానికి ఐరా ముస్తాబవుతోంది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే నయనతార మనసులో చాలా కాలంగా ఒక ఆశ ఉందట. దక్షిణాదిలోనే నంబర్‌వన్ కథానాయకిగా వెలుగొందుతున్న నయనతార పారితోషికం కూడా ఆ రేంజ్‌లోనే పుచ్చుకుంటోంది. ఇప్పటికే 5 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సుందరి విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలకు ధీటైన పాత్రల్లో నటిస్తోంది. కాబట్టి పాత్రల్లోనే కాకుండా పారితోషికం విషయంలోనే వారిని మించిన స్థాయిలో ఉండాలన్నది ఈ అమ్మడి చిరకాల ఆశ అట. అదీ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకోవాలని ఆశ పడుతోందట. ఇది సాధ్యమేనా? ప్రస్తుతం నయనతార నటుడు విజయ్‌తో ఆయన63వ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. సుమారు 10 ఏళ్ల తరువాత ఈ క్రేజీ జంట కలిసి నటిస్తున్న చిత్రం ఇది. కాగా మరో విషయం ఏంటంటే కేజేఆర్ స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ నయనతార హీరోయిన్గా వండర్ఉమెన్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇది గనుక కార్యరూపం దాల్చితే నయనతార చిర కాల ఆశ నెరవేరుతుందో? లేదో? గానీ, ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. -
అగ్రతారల బాటలో..
తమిళసినిమా: సంచలనాలకు మరో పేరు అమలాపాల్ అని చెప్పవచ్చునేమో. సాధారణంగా వివాదాస్పద విషయాలతో చాలా మంది పేరును చెడగొట్టుకోవడమో, అవకాశాలను కోల్పోవడమో జరుగుతుంది. కానీ అమలాపాల్ విషయం వేరు. ఏదో సంఘటనతో వార్తల్లో ఉండే ఈ కేరళాకుట్టికి అవి తన కేరీర్‌కు మేలు చేస్తుంటాయి. ఆ విధంగా ఈ అమ్మడు లక్కీ అనే చెప్పాలి. మైనా చిత్రంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అమలాపాల్ ఆ తరువాత గ్లామర్‌కు మారిపోయింది. అయితే అమ్మ కణక్కు వంటి చిత్రాల్లో యుక్త వయసు కూతురికి అమ్మగా నటించి నటిగా తానేమిటో మరోసారి చూటుకుంది. వివాహానంతరం నటనకు దూరంగా ఉన్నా, వివాహ రద్దు తరువాత మళ్లీ నటించడం మొదలెట్టినా, ఆమె నటన దాహాన్ని తీర్చే కథా చిత్రం అమరలేదు. అయితే తాజాగా అలాంటి అవకాశం అమలాపాల్ ఇంటి తలుపు తట్టింది. అగ్ర తారలు నయనతార, అనుష్క వంటి వారు ఒక పక్క కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలను నటిస్తూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. తాజాగా అమలాపాల్‌కు అలాంటి అవకాశం వరించింది. ఇంతకుముందు తొలి చిత్రం మేయాదమాన్‌తోనే సక్సెస్‌ను అందుకున్న యువ దర్శకుడు రత్నకుమార్ రెండో ప్రయత్నానికి సిద్ధం అయ్యారు. ఆయన తన మలి చిత్రాన్ని హీరోయిన్ సెంట్రిక్ కథను తయారు చేసుకున్నాడు. ఇందులో అమలాపాల్‌ను కథానాయకిగా ఎంచుకోవడం విశేషం. దీనికి ఆయన ఆడై అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రం గురించి రత్నకుమార్ తెలుపుతూ ఈ చిత్రం పూర్తి విభిన్నంగా, హృదయాన్ని టచ్ చేసే పాయింట్‌తో కూడిన ఫన్ ఎంటర్టెయినర్గా ఉంటుందని చెప్పారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని, షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి విజయ్‌కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణ, ప్రదీప్‌కుమార్ సంగీతం అందించనున్నారు. మొత్తం మీద నటి అమలాపాల్ టైమ్ బాగుందన్నమాట. -
హన్సిక కూడా రెడీ అయిపోతోంది
తమిళసినిమా: హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అరణ్మణై–2 చిత్రంతో హర్రర్ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్.జమీల్ మెగాఫోన్ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే. ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు. మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్స్టార్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్ చెప్పారు. -
అనుష్కకు పెళ్లి చేయాలని..
సాక్షి, సినిమా: స్వీటీ మాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యిందంటున్నారు సినీ వర్గాలు. బెంగళూరుకు చెందిన యోగా టీచర్ అనుష్క. సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అదే విధంగా రెండో చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే టాలీవుడ్‌నే అనుష్కను ఆదరించింది. ఆదిలో అందాలారబోసినా, అరుంధతి చిత్రం అనుష్క సినీ జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు అనుష్క తలుపుతట్టడం మొదలెట్టాయి. కోలీవుడ్‌లో అడపాదడపా నటిస్తూ ఇక్కడా తన ఉనికిని చాటు కుంటున్న అనుష్క బాహబలి సిరీస్, భాగమతి వంటి చిత్రాలు తన స్థాయిని మరింత పెంచేశాయి. అయితే మొదటి నుంచి ఎక్కువ చిత్రాలు చేయాలని కాకుండా మంచి కథా పాత్రల్లో నటించడానికే ఈ స్వీటీ ఆసక్తి చూపుతున్నారు. భాగమతి చిత్రం మంచి విజయం సాధించినా, మరో చిత్రం ఇప్పటి వరకూ కన్ఫార్మ్ కాలేదు. అయితే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు ఇటీవల అనుష్కనే స్వయంగా వెల్లడించారు. అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. మధ్యలో అనుష్కకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. వయసు పెరుగుతోందని పెళ్లికి ఒత్తిడి చేయడంతో అనుష్క కూడా ఈ ఏడాది చేసుకుంటానని వారికి మాట ఇచ్చినట్లు ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లో మాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో జతకట్టేందుకు రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. మలయాళంలో నటించాలన్న కోరిక అనుష్కకు చాలా కాలంగానే ఉందట. అయితే అలాంటి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా మమ్ముట్టి సరసన అనగానే అంగీకరించినట్లు తెలిసింది. దీనికి శరత్ సందీప్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మమ్మట్టి హీరోగా పరోల్ అనే చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. అనుష్క మాలీవుడ్ ఎంట్రీ చిత్రం గురించి త్వరలోనే అధికారికపూర్వ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
ఖోఖో కాదు..కోకో
తమిళసినిమా: ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించాలంటే కోలీవుడ్‌లో నయనతార, టాలీవుడ్లో అనుష్కలే ముందు గుర్తుకొస్తారని చెప్పవచ్చు. అలాంటిది అనుష్క చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రం ఉంది. తను పెళ్లికి రెడీ అవుతోందని, అందుకే కొత్త చిత్రాలు అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజాలేమిటన్నది అనుష్క నోరు విప్పితే కానీ తెలియదు. నయనతార మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ఈమె గురించి పెళ్లి వార్తలు కాదుగానీ, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తున్న ప్రచారం మాత్రం మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే నయనతార చేతి నిండా చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉంది. మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వరుసగా నయనతార తలుపు తడుతున్నాయి. మధ్యలో డోర చిత్రం నిరాశపరచినా, నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ వంటి కమర్శియల్ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో పాటు, మలయాళంలో నవీన్పాల్తో ఒక చిత్రం చేస్తోంది. వీటిలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన వేలైక్కారన్ చిత్రం వచ్చే నెల 29న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా నయనతార మరో కథానాయకి పాత్ర చుట్టూ తిరిగే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. బ్లాక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి ఖోఖో అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరగడంతో ఇదేదో క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం అని చాలా మంది భావించారు. నిజానికి ఈ చిత్ర టైటిల్ ఖోఖో కాదట. కోకో అట. కోకో అంటే కోలమావు కోకిల అట. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నయనతార చిత్రానికి ఈయన సంగీత బాణీలు కట్టడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.