కృష్ణమ్మ కనుమరుగు! | Krishna river water level decreases day by day | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కనుమరుగు!

Published Mon, Mar 14 2016 7:47 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

Krishna river water level decreases day by day

- కృష్ణా నదిలో వేగంగా పడిపోతున్న నీటిమట్టం
- ప్రకాశం బ్యారేజీ వద్ద 7.2 అడుగులే
- 50 ఏళ్లలో ఇదే తక్కువంటున్న ఇంజనీర్లు
- నాగార్జునసాగర్‌లో మిగిలింది 130.15 టీఎంసీలు
- శ్రీశెలం పరిస్థితి మరింత దారుణం  
- రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్నది 35 టీఎంసీలే

 
సాక్షి, విజయవాడ: గతంలో ఎన్నడూలేని విధంగా కృష్ణా నదిలో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ప్రకాశం బ్యారేజీలో నీరు అడుగంటుతోంది. దీంతో కాల్వలకు నీరు వదలడం పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కూడా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇంకా ఎండలు ముదరకముందే పరిస్థితి ఇలా ఉంటే మండు వేసవిలో నీటి కష్టాలు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
కాల్వలకు నీరు బంద్
కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ 7 అడుగులకు తగ్గిపోవడం గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల వరకు నీటిని నిల్వ ఉంచుతారు. వేసవిలో నీటి లభ్యత తగ్గితే 8 అడుగులకు చేరగానే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వదిలేవారు. ప్రస్తుతం అక్కడ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో వదులుతున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 8 అడుగుల కంటే నీరు తక్కువగా ఉండడంతో నాగార్జునసాగర్ నుంచి నాలుగున్నర టీఎంసీలు వదిలారు. ఇందులో రెండు టీఎంసీల నీరు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వెళుతుంది.
 
కృష్ణా జిల్లాకు రెండున్నర టీఎంసీల నీరే వస్తుంది. సాగర్ నుంచి రోజుకు 3 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ వదలడం లేదని తెలిసింది. దీంతో ఈ నీరు పులిచింతలకు.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చేసరికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ నీరు చేరినా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి అన్ని కాల్వలకు నీరు వదలడం నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్‌టీటీపీఎస్) ఉన్నాయి. వాటి అవసరాల కోసం కృష్ణా నది నుంచి మోటార్ల ద్వారా తోడుకుంటుండడంతో బ్యారేజీలో నీటిమట్టం తగ్గిపోతోంది.  
 
35 టీఎంసీల కంటే ఎక్కువ నీరు రాదు
నాగార్జునసాగర్‌లో గరిష్ట నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 509.1 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. గతంలో అత్యవసర పరిస్థితుల్లో 490 అడుగుల వరకు నీటిని తోడినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. సాగర్‌లో 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం 130.15 టీఎంసీల నీరు ఉంది. ఇందులో 100 టీఎంసీల నీరు తీయడం కుదరదు.
 
ఈ లెక్కన నాగార్జునసాగర్ నుంచి ఇక 30 టీఎంసీలే వాడుకోవచ్చు. శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ నీటిమట్టం 855 అడుగులకుగాను ప్రస్తుతం 812.5 అడుగులే ఉంది. 215 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, కేవలం 35 టీఎంసీలే ఉంది. ఇందులో 5 టీఎంసీలే ఉపయోగించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి 35 టీఎంసీల కంటే ఎక్కువ నీరు రాదు. ఈ నీటిని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంచుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement