సీఎం కేసీఆర్.. కార్మికుల పక్షపాతి
ఆటో మోటార్స్ ట్రేడ్ యూనియన్ ఆత్మగౌరవ సభలో కేటీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్మికుల, పేదల పక్షపాతి అని రాష్ట్ర పంచాయతీ, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ ఆటో మోటర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పేదవారి సంక్షేమానికి ఎక్కడా లేని విధంగా రూ.33 వేల కోట్లతో 26 ప్రత్యేక పథకాలను అందిస్తున్నామన్నారు. రూ.77కోట్ల ఆటో రవాణా పన్ను బకాయిలను ఈ చలాన్ల బకాయిలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు.
నాలుగైదు రోజుల్లో ఆటో సంఘాల నాయకులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేస్తానని హామీఇచ్చారు. 9.50 లక్షల డ్రైవర్లకు రూ.5 లక్షల చొప్పున ఉచిత ప్రమాద బీమాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వర్తింపజేసిందని పేర్కొన్నారు. 58 జీవో కింద 1.50 లక్షల మందికి ఉచితంగా పట్టాలను పంపిణీ చేశామని, పేదలందరికి పైసా పెట్టకుండా డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిమోదీ ఈ 18 నెలల కాలంలో ఏమి చేశారో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
గ్రేటర్‌లోని 1.40 లక్షల ఆటోవాలాలు కథానాయకులలాగా ముందుండి గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జనవరి మొదటివారంలో టీఆర్‌ఎస్ కార్మిక సంఘాలతో నిజాం కళాశాలలో పెద్దఎత్తున సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రూప్‌సింగ్ అధ్యక్షతన వహించగా, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్యామేల్, యూనియన్ నాయకులు నారాయణ, హామీద్, చల్లా అశోక్ ముదిరాజ్, మహేష్, అంజ య్య, శ్రీనివాస్, బలరాజు యాదవ్, శ్రవణ్‌కుమార్, ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ బాధ్యులు ముద్దగౌని రాంమోహన్‌గౌడ్, నేతలు పోచబోయిన జగదీష్ యాదవ్, కొప్పుల విఠల్‌రెడ్డి, కత్తుల రాంబాబు, సురేఖ, శైలజ, మసిరెడ్డి అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.