పండుగ ఏర్పాట్లు నిష్ఫలం
-
కమిషనర్‌పై చర్యకు మంత్రి ఆదేశం
-
జిల్లా కలెక్టర్, ఈఎండీతో మంత్రి సమీక్ష
-
విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
-
పండుగ తర్వాత మరింత మందిపై చర్యలకు అవకాశం
సాక్షి ప్రతినిధి–ఽనెల్లూరు : రొట్టెల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించి భేష్ అనిపించుకోవాలనుకున్న ప్రభుత్వం అంచనాలు తల్లకిందులయ్యాయి. మున్సిపల్ మంత్రి నారాయణ నెలరోజులుగా దీనిపై దృష్టిపెట్టినా చివరికొచ్చే సరికి ఏర్పాట్లు అసంతృప్తిని మిగిల్చాయి. దీనికి తోడు గత ఏడాదితో పోల్చితే భక్తుల సంఖ్య కూడా పలుచగా కనిపించడంతో మంత్రికి ఆగ్రహం రెట్టింపైంది. కార్పొరేషన్ కమిషనర్ మీద చర్యలకు ఆయన మున్సిపల్ పరిపాలన విభాగం డైరెక్టర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రొట్టెల పండుగ సందర్భంగా ఈ సారి 15 లక్షల మంది భక్తులు హాజరు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి నారాయణ ప్రయత్నించారు. మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కూడా ఆయన సమీక్ష జరిపారు. పండుగ ప్రారంభానికి ముందు దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లు ఎలా ఉండాలనే విషయం గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఆదేశించినా పండుగ ప్రారంభమైన 12వ తేదీ నాటికి కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే తొలిరోజు అపరిశుభ్రవాతావరణం కనిపించింది. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులు ఇబ్బంది పడ్డారు. దర్గా, చెరువు ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేని భక్తులు సేద తీరడానికి సరైన షెడ్లు కూడా నిర్మించలేదు. రూ.కోటికి పైగా ఖర్చు చేసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల మంత్రి నారాయణ అధికారులతో పాటు మేయర్ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేకాధికారి నియామకం
కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వైఫల్యం మీద ఆగ్రహించిన మంత్రి నారాయణ గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన మూర్తిని రొట్టెల పండుగ ప్రత్యేకాధికారిగా నియమింప చేశారు. సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు మున్సిపల్ కమిషనర్లను ఇక్కడకు రప్పించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి 365 మంది పారిశుధ్య సిబ్బందిని రప్పించారు. గురువారం నాటికి మున్సిపల్ పరిపాలనా డైరెక్టర్ కన్నబాబును నెల్లూరు రప్పించారు. ఏర్పాట్లలో కార్పొరేషన్ వైఫల్యం వల్ల మహిళా భక్తులు పర్యాటక శాఖ కార్యాలయం ఆవరణలోని మూత్రశాలల వద్ద క్యూ కట్టిన తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే విషయం మంత్రి గ్రహించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంఈ కన్నబాబుతో రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి సమావేశమయ్యారు. పండుగ ఏర్పాట్లను కమిషనర్ సీరియస్‌గా తీసుకోలేదని, మేయర్ కూడా సిబ్బందిని అదుపులో ఉంచుకుని వేగంగా పనులు జరిపించలేక పోయారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆగ్రహం నేపథ్యంలో కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మీద శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా పండుగ ముగిసిన అనంతరం మరింత మంది మీద చర్యలు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.