లలిత కళాపీఠం ఏర్పాటు
* విధివిధానాలపై చర్చించిన కమిటీ
* సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల నిర్వహణ
* కోర్సుల అధ్యయనానికి ఉప సంఘం
ఏఎన్‌యూ: యూనివర్సిటీలో తెలుగు కళలు, సాహిత్య వికాసం కోసం ఎన్‌టీఆర్ పేరుతో లలిత కళాపీఠం ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ అంశంపై గతంలో జరిగిన అకడమిక్ సేనేట్‌లో చర్చ జరిగింది. సమావేశంలో దీనికి ఆమోదం తెలపటంతో లలిత కళాపీఠం ఏర్పాటుపై వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ బుధవారం యూనివర్సిటీలోని పరిపాలనా భవన్‌లో సమావేశమై కళాపీఠం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది. వీసీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ రంగ ప్రముఖులు దేవదాస్ కనకాల, పత్రికా రంగ నిపుణులు డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు తదితరులు సుదీర్ఘంగా చర్చించారు. కళాపీఠం ఆధ్వర్యంలో రంగస్థల నటన, యాంకరింగ్, న్యూస్ రీడింగ్‌లలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు తెలుగు భాషా వికాసంలో భాగంగా అవధాన ప్రక్రియ అనే కోర్సును ప్రారంభించాలని కమిటీ సూచించింది. కళాపీఠం ఆధ్వర్యంలో ఏఎన్‌యూలో నాలుగో శనివారం నాటకాలు, జానపద కళారూపాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని చెప్పింది. నూతన కోర్సుల ప్రారంభానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు దేవదాస్ కనకాల, డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, ఏఎన్‌యూ తెలుగు విభాగం అధ్యాపకులు ఆచార్య పీ వరప్రసాదమూర్తి, డాక్టర్ ఎన్‌వీ కృష్ణారావులతో ఉపసంఘాన్ని నియమిస్తూ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య జాన్‌పాల్, నాటక రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఏఎన్‌యూ తెలుగు విభాగ అధ్యాపకులు ఆచార్య పీ వరప్రసాదమూర్తి, డాక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.