
ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిద్దాం!
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పెద్దఎత్తున ఉద్యమించడానికి పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు.
►కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి అన్నీ అనుకూలమే
►అయినా పట్టించుకోని పాలక ప్రభుత్వాలు
►ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా ఏకం కావాలి
►కడప ఉక్కు–రాయలసీమ హక్కు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
కడప రూరల్ : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పెద్దఎత్తున ఉద్యమించడానికి పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కులా కడప ఉక్కు కోసం ఉద్యమించినప్పుడే ఫ్యాక్టరీ ఏర్పడుతుందని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కడప ఉక్కు పోరాట సమితి కన్వీనర్ ఎన్.రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప ఉక్కు–రాయలసీమ హక్కు అనే అంశంపై అఖిలపక్ష నేతలు, వివిధ సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లాలో అన్నీ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకడంతోపాటు రాయలసీమ మొత్తం అభివృద్ది దిశగా అడుగులు వేస్తుందన్నారు. కడప శాసనసభ్యులు ఎస్‌బి అంజద్‌బాష మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనా పగ్గాలను చేపట్టి మూడేళ్లు దాటినప్పటికీ ఆయన రాయలసీమకు చేసిందేమీ లేదని ఆరోపించారు. గతంలో ఏదైనా ఒక అంశంపై ఆందోళన కార్యక్రమాలు చేపడితే అధికారులు వచ్చి ఆరా తీసేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. కడప ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా కోటిరెడ్డి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే ఆ ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ జీవించి ఉంటే బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ వల్ల కడప మరో విశాఖలా మారేదన్నారు. కడప మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేపట్టే భవిష్యత్తు కార్యచరణ, చేపట్టే ఉద్యమాలకు తానెప్పుడూ ముందుంటానన్నారు.
ఈ ఉద్యమంలో టీడీపీ, బీజేపీ నాయకులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కడప ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ ఎన్.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనే కడప ఉక్కు పోరాట కమిటీ ధ్యేయమన్నారు. అందుకోసం భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున బహిరంగసభ, అనంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ కోసం చేపట్టే ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ నేటి పాలకులు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోకపోవడం తగదని హితవు పలికారు. ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ ప్రజాప్రయోజనం కలిగించే కడప ఉక్కు ఫ్యాక్టరీ పాలక ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యాసంస్థల అధినేతలు జోగి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోతే అదొక చారిత్రాత్మక తప్పిదమవుతుందన్నారు. విద్యార్థి నాయకులు రవిశంకర్‌రెడ్డి, బీఎస్పీ నాయకులు గుర్రప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు సురేష్, భాస్కర్‌రెడ్డి, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఇషాక్ అలీ, లింగమూర్తి, శేఖర్ పాల్గొన్నారు.