ఉడ్మల్‌గిద్ద శివారులో పాదయాత్ర చేస్తున్న అఖిలపక్ష నాయకులు
-
ప్రాణాలు ఫణంగా పెట్టయినా సాధించుకుంటాం
-
మహాపాదయాత్రలో అఖిలపక్ష నేతల వెల్లడి
దామర గిద్ద: చితికిన రైతన్నల బతకులు బాగు పడాలంటే, చెరువులు నిండి బోరుబావుల్లో నీళ్లు పెరిగి పంటలు పండాలంటే కొడంగల్– నారాయణపేట ఎత్తిపోతల పథకమే శరణ్యమని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ఎత్తిపోతల పథకం సాధనం కోసం ఈనెల 22న మక్తల్ నుంచి ప్రారంభించిన మహాపాదయాత్ర బుధవారం ఐదవ రోజు దామరగిద్దకు చేరింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు పక్కనే ఉన్న జలాలను వదిలిపెట్టి ఎక్కడో 150కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని అందించడమంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందమే అన్నారు. సాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. లక్షలాది మంది ప్రజలు అభీష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఆగస్టు 1వ తేదీ నాటికి ఈ పాదయాత్ర జిల్లాకేంద్రానికి చేరుకునేలోపు ప్రభుత్వం జీఓనం.69 అమలుపై స్పష్టమైన ప్రకటన చేసితీరాలన్నారు. లేనిపక్షంలో అదే వేదికపై నుంచి మరో ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. జిల్లాకేంద్రంలో జరిగే మహా బహిరంగసభకు పల్లెపల్లె నుంచి వేలాదిగా కదిలొచ్చి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని తమ్మినేని విజ్ఞప్తిచేశారు.
సీడీ ఆవిస్కరణ ఎత్తిపోతల సాధన ఉద్యమ ప్రాధాన్యతను తెలియజేస్తూ.. రైతుల కష్టాలు, గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ రచయితలు లక్ష్మిసాల్మాన్ రూపొందించిన గేయాల సీడీని ఆఖిలపక్ష నాయకులు విడుదల చేశారు. పాదయాత్రలో బీజేపీ నేత నాగురావు నామాజీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దయాకర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు, టీఎన్‌జీఓ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ సరాఫ్ కష్ణ, కష్ణా జలసాధన డివిజన్ కమిటీ కన్వీనర్ అనంత్‌రెడ్డి, సీఐటీ యూ రాష్ట్ర నాయకులు భూపాల్ ప్రసంగించారు.