
గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తున్న చాడ, మందకృష్ణ, ఉత్తమ్, రమణ, కిషన్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట చౌరస్తాలో బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, భాజపా నేత కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే అంబేడ్కర్ విగ్రహం తొలగించిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కొన్ని ప్రకటనలు చేసి దిద్దుబాటు చర్యలు తీçసుకోకపోవడాన్ని గవర్నర్‌కు తెలిపినట్లు చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన స్థానంలోనే కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పోరాటాలను ఈ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందన్నారు. విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న వారి పేర్లను బయటపెట్టి నిందితుల్ని జైలుకు పంపాలని కోరామని ఎల్.రమణ అన్నారు.