స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మంగళవారం విడుదల చేశారు.
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మంగళవారం విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు స్వీకరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాఖలు చేయొచ్చు. మార్చి ఒకటిన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరి గడువు. పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు బీ ఫారం ఈ నెల 28వ తేదీ మూడు గంటల్లోగా చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి, రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
లేనిపక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. అభ్యర్థి గానీ, వారి తరఫు పది మంది ప్రతిపాదకుల్లో ఒకరు గానీ నామినేషన్ దాఖలు చేయొచ్చు. ప్రతిపాదకులు స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో నమోదై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతరులకు రూ.10 వేలు డిపాజిట్‌గా నిర్ణయించారు. అభ్యర్థి ఎలక్ట్రోరల్ జాబితా సర్టిఫైడ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. కాగా.. తొలి రోజున ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు.