
సంగారెడ్డి ట్యాంకుబండ్ వద్ద నిమజ్జనం
అంగరంగ వైభవంగా శోభాయాత్ర
పులకించిన భక్తజనం
సంగారెడ్డిలో కలెక్టర్, ఏజేసీ, ఏఎస్పీల పర్యవేక్షణ
మహబూబ్‌సాగర్ చెరువు వద్ద భారీ ఏర్పాట్లు
పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన నిమజ్జన యాత్ర
గజ్వేల్: ‘జై గణేశా...జైజై గణేశా... గణపతిబప్పా మోరియా’... నినాదాలు జిల్లాలో మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, జహీరాబాద్, దుబ్బాక తదితర ప్రాంతాల్లో శోభాయాత్ర జరిగింది.
డప్పుచప్పుళ్లతో శోభాయాత్రలు అట్టహాసంగా సాగాయి. యువతీ యువకులు, చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడిపాడి సందడి చేశారు. దాండియా ఆడారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఉత్సవశోభతో జనం పులికించిపోయింది.
సంగారెడ్డిలో...
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 238కిపైగా గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఏజేసీ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ వెంకన్నల పర్యవేక్షణలో ఈ ఉత్సవం సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలో డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, మరో వంద మందికిపైగా పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్‌సాగర్ చెరువు వద్ద నిమజ్జనం కోసం నాలుగు క్రేన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని జనాన్ని ఉత్సాహ పరిచారు.
సిద్దిపేటలో...
సిద్దిపేటలో నిమజ్జనపర్వం భక్తిశ్రద్ధల మధ్య సాగింది. పట్టణంలో 300కుపైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు కాగా గురువారం రాత్రి 40శాతం విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోమటి చెరువు వద్ద నిమజ్జనం కోసం మూడు ప్రత్యేక క్రేన్‌లు ఏర్పాటు చేశారు. సిద్దిపేట డీఎస్పీ మహ్మద్ షేక్‌లాల్ అహ్మద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు సాగాయి.
మెదక్‌లో...
మెదక్ పట్టణంతోపాటు మండలంలో నిమజ్జనోత్సహాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలో మాత్రం గురువారం మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర కొనసాగింది. రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లోనూ ఘనంగా నిర్వహించారు.
జహీరాబాద్‌లో...
జహీరాబాద్ పట్టణంలో గురువారం రాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య వేడుకలను ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో 80 విగ్రహాలను ప్రతిష్ఠించగా నిమజ్జనానికి కదిలించారు. ఆయా యువజన సంఘాలు వినాయక విగ్రహాల ముందు భజనలు, నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్వజనిక్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం పలికారు. కోహీర్‌లో సైతం సార్వజనిక్ వినాయక విగ్రహ ఊరేగింపు నిర్వహించారు.
పటాన్‌చెరులో..
పటాన్‌చెరులో ఊరేగింపు ఘనంగా సాగింది. పట్టణంలో ఉదయం నుంచే సందడి మొదలైంది. గణేశ్‌గడ్డ ఆలయంలో గణపతికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబీకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రివేళలో నిమజ్జనపర్వం కొనసాగింది. పట్టణంలోని సాకిచెరువు, పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనోత్సవంలో భజన సంకీర్తనలతో విజయవాడకు చెందిన కళాకారులు ఆకట్టుకున్నారు.
గజ్వేల్‌లో...
గజ్వేల్ పట్టణంలో బుధవారం రాత్రి నిమజ్జనపర్వం 90శాతం పూర్తికాగా మిగిలిన మరో 10శాతం వినాయక విగ్రహాలను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని పాండవుల చెరువు, క్యాసారంలోని కొత్తకుంట, ప్రజ్ఞాపూర్‌లోని ఊరచెరువులకు తరలించారు. దుబ్బాకలో ఈనెల 17న నిమజ్జనోత్సవం భారీ ఎత్తున జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నర్సాపూర్‌లో మూడు రోజులుగా నిమజ్జనపర్వం సాగుతోంది. జోగిపేటలోనూ నిమజ్జనోత్సవం గురువారం రాత్రి పాక్షికంగానే ప్రారంభమైంది.