
నిమజ్జనం.. ఓ విఘ్నం!
►ముంచుతారా.. తేలుస్తారా!
►గణనాథునికి నిమజ్జన కష్టాలు
►జిల్లాలో ఎక్కడా చుక్కనీరు లేని వైనం
►హెచ్‌ఎల్‌సీ నీటి విడుదల అనుమానమే..
►ప్రత్యామ్నాయం శూన్యం
అనంతపురం సెంట్రల్: కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. మరో మూడు రోజుల్లో మొదలవనున్న ఈ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్న వేళ.. ఓ విఘ్నం భక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు నీటి జాడ లేకపోవడంతో నిమజ్జనం ఎలా చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పండుగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు.. జిల్లా కేంద్రంలో ఐదు రోజులకు నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. గతంలో ఎప్పుడూ ఈ సమయానికి చెరువులు జల కళ సంతరించుకునేవి. తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్‌ఎల్‌సీ)కి పుష్కలంగా నీళ్లొచ్చేవి. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి కరువయింది.
ఎక్కడా చుక్క నీరు లేని పరిస్థితుల్లో నిమజ్జనం ఎలాగనే చర్చ తలెత్తుతోంది. అనంతపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుత్తిరోడ్డులోని హెచ్‌ఎల్‌సీ కాలువ వద్ద పెద్ద క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తారు. అలాంటిది.. ఇప్పటి వరకు కాలువకు నీటి విడుదల లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఇటీవల జరిగిన టీబీ బోర్డు సమావేశంలో జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉందని.. సెప్టెంబర్ నాటి పరిస్థితి ఆధారంగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిడ్ పెన్నార్ జలాశయం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది.
పీఏబీఆర్‌లో మాత్రమే ఒక టీఎంసీ నీరు ఉంది. ఈ నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, వైఎస్‌ఆర్ తాగునీటి పథకాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టీబీ డ్యాం నీటి విడుదల విషయమై బళ్లారి జిల్లా కలెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో నిమజ్జనం విషయంలో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నడూ చూడని విధంగా జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవానికి నీటి కష్టాలు చుట్టుముట్టడం గమనార్హం. గతంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఒట్టి చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనూ అలాంటి పరిస్థితి తప్పదేమోననే చర్చ జరుగుతోంది.
తాగునీటిని వదిలేది లేదు
తుంగభద్ర జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరాం. మంగళవారం నుంచి 500 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల అడుగుతున్నాం. ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎంపీఆర్, సీబీఆర్ జలాశయాలు ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. పీఏబీఆర్‌లో నెలరోజులకు సరిపడా మాత్రమే నీళ్లున్నాయి. ఎట్టి పరిస్థితిలో నీళ్లు వదిలేది లేదు. వినాయక నిమజ్జనం ఎలా అనేది నా పరిధిలో లేదు.
- టి.వి.శేషగిరిరావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లా కేంద్రంలో మాత్రమే 500లకు పైగా విగ్రహాలు కొలువు దీరుతాయి. ఐదవరోజు వేలాది మంది జనసందోహం నడుమ నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీ. నిమజ్జనానికి నీళ్లు వదలాలని గతంలో హెచ్చెల్సీ అధికారులను కోరాం. జిల్లా అధికారులతో పాటు నాయకులు చొరవ చూపాలి.
- పరుచూరి రమేష్, వినాయక ఉత్సవ సమితి, ప్రధాన కార్యదర్శి
నీళ్లు వస్తాయి
తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని తుంగభద్రబోర్డు అధికారులను కోరాం. రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి నీటిని వదులుతారు. వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాం. ఒకవేళ రాని పక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం.
- వీరపాండియన్, జిల్లా కలెక్టర్