లారీ డ్రైవర్ బలవన్మరణం
Published Sun, Nov 13 2016 1:59 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఉంగుటూరు : జాతీయరహదారిపై ఉంగుటూరు వద్ద శనివారం ఆగి ఉన్న లారీపై మోకుతో ఉరి వేసుకొని అదే లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణలోని నల్గొండ జిల్లా చిలుకూరి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కొపేర్ల నాగరాజు (32) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజమండ్రి నుంచి సిమెంట్ ముడి సరుకు లోడుతో నల్గొండ వెళుతుండగా ఉంగుటూరు వద్ద లారీని ఆపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపారు. మృతునికి భార్య వీరమణి, కుమారై రాఘశ్రీ, కుమారుడు రాకేష్ ఉన్నారు. నాగరాజుకు పదేళ్ల క్రితం వివాహమైందని, అతడు వ్యసనాల బారిన పడటంతో కొద్దికాలంగా భార్య ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుందని తెలిసింది. అమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చావా సురేష్ చెప్పారు. మృతుని భార్య వీరమణికి సమాచారం అందించగా ఆమె హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి పంచనామా చేసి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీకి వేలాడి ఉండటం, ఎటువంటి పెనుకులాట లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. మృతదేహం వద్ద భార్య వీరమణి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement
Advertisement