ఆగిన లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
-
ఇద్దరు దుర్మరణం
-
11 మందికి గాయాలు
నాయుడుపేట : అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చెన్నై– కోల్‌కత్తా జాతీయ రహదారిపై మండలంలోని నరసారెడ్డి కండ్రిగ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. గూడూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీధర్ నరసారెడ్డి కండ్రిగ సమీపానికి వచ్చే సరికి కునుకు తీయడంతో మరమ్మతులకు గురై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొంది. బస్సు ఎడమవైపు కండక్టర్ సీట్ వరకు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గూడూరు మండలం చవటపాళెంకు చెందిన కండక్టర్ కావాడి మునీంద్ర (38) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కండక్టర్ వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ప్రకాశం జిల్లా నాగులఉప్పలపాడు మండలం ఉప్పు కొండూరుకు చెందిన వలకలూరి సుధాకర్ (40) తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికుల్లో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగ గ్రామానికి చెందిన గోగుల సాయికృష్ణకు తలపై తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం సిమ్స్‌కు తరలించారు.
ఆయన భార్య చందన, అత్త వేముల శారదకు స్వల్పగాయాలయ్యాయి. వీరు శ్రీశైలం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఎలుతూరు కండ్రిగకు చెందిన చెన్నవరపు సుబ్బరత్న, మన్నెమాల శాంతి, గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గణపతి స్వదీప్, పొదలకూరు మండలం అమ్మవారిపాళెంకు చెందిన రావులపల్లి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా యదనపూడి మండలం జాగర్లమూడికి చెందిన తుమ్ములూరు రవి, నెల్లూరు నవాబుపేటకు చెందిన బుల్లా శివకుమార్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా జూలమూరు మండలం వరమాటివలత గ్రామానికి చెందిన గొండు రమణయ్య, పొన్నా కృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108లో నాయుడుపేట ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మృతి చెందిన కండక్టర్, ప్రయాణికుడి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఆలస్యంగా చేరుకున్న పోలీసులు
ప్రమాదం జరిగిన విషయం స్థానిక పోలీసులకు సమాచారం అందించినా సకాలంలో స్పందించకుండా ఆలస్యంగా ఘటన స్థలికి చేరుకున్నారు. డ్రైవర్ శ్రీధర్ గూడూరు డిపోకు సమాచారం అందించడంతో ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులకు దగ్గర ఉండి వైద్య సదుపాయం అందేలా చర్యలు చేపట్టారు.
చెల్లెలు చెంగమ్మ రాఖీ ఎవరికి కట్టాలి తమ్ముడు
తమ్ముడూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా.. చెల్లెలు చెంగమ్మా రాఖీ ఎవరికి కడుతుంది అంటూ మృతుడు కండక్టర్ కావాడి మునీంద్ర అన్న మునిరాజ స్థానిక ఆసుపత్రి వద్ద గుండెలు పగిలేలా రోదించారు. ఒక్కగానొక్క చెల్లెలు చెంగమ్మ అన్న డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు రాఖీ కట్టాలంటూ నీ కోసం రాఖీతో ఎదురు చూస్తుంది తమ్ముడు అంటూ విలవిలాడిపోయాడు. ఆ చెల్లికి నేనేమి సమాధానం చెప్పాలి అంటూ గుండెలు బాధుకున్నాడు. నలుగురి అన్నదమ్ములకు ఒకే చెల్లెలు చెంగమ్మ ఇక ఏ అన్నకు రాఖీ కట్టాలంటూ బోరున విలపించడం చూసిన చవటపాళెం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది.
పొట్టకూటి కోసం వచ్చి మృత్యు ఒడిలోకి..
పొట్టకూటి కోసం కూలీ పనులకు వచ్చి మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ప్రకాశం జిల్లా కూలీలు మేస్త్రీ వలకలూరి సుధాకర్ మృతి చెందటంతో విషాదంలో మునిగిపోయారు. సొంత ఊరిలో కూలీపనులు లేక వలస వచ్చి నాయుడుపేట బాలుర గురుకుల పాఠశాలలో ట్యాంకు నిర్మాణ పనులకు ప్రకాశం జిల్లా ఉప్పుకొండూరు నుంచి గూడూరుకు రైలులో వచ్చాడు. అక్కడి నుంచి గూడూరు–తిరుపతి బస్సు ఎక్కిన సుధాకర్‌ను విధి కాటేసింది.