భారీగా శ్యాంపిల్ మందులు స్వాధీనం
జిల్లా కేంద్రమైన కర్నూలులో భారీగా శ్యాంపిల్ మందులు లభించాయి. ఔషధ నియంత్రణ అధికారులు పకడ్బందీగా ఓ ఇంటిపై దాడి చేసి రూ.15లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు.
–ఓ ఇంట్లో రూ.15లక్షల విలువ చేసే మందులు
–రెక్కి నిర్వహించి పట్టుకున్న డ్రగ్స్ అధికారులు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా కేంద్రమైన కర్నూలులో భారీగా శ్యాంపిల్ మందులు లభించాయి. ఔషధ నియంత్రణ అధికారులు పకడ్బందీగా ఓ ఇంటిపై దాడి చేసి రూ.15లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. తమ వీధిలోని ఓ ఇంట్లో ఇలాంటి అక్రమ వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని కాలనీవాసులు విస్తుపోయారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన దామోదర్ గతంలో కడప జిల్లాలో మెడికల్ షాప్ నిర్వహించేవాడు. మందుల క్రయవిక్రయాల్లో లాభాలను బాగా తెలుసుకున్న అతను వైద్యులకు ఇచ్చే ఫిజీషియన్ శ్యాంపిల్స్‌పై కన్నేశాడు. వాటిని చెన్నై, కోయంబత్తూరు, మధురై ప్రాంతాలతో పాటు స్థానికంగా కొందరు మెడికల్ రెప్‌ల నుంచి ఫిజీషియన్ శ్యాంపిల్స్‌ను కొనుగోలు చేసేవాడు. వాటిని స్థానిక బళ్లారిచౌరస్తాలోని సంపత్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఉంచి వ్యాపారం చేసేవాడు. వీటిని అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆర్‌ఎంపీలకు విక్రయించేవాడు. ఇతని వద్ద నుంచి కర్నూలు జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజ, అలంపురం, గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి ఆర్‌ఎంపీలు వచ్చి కొనుగోలు చేసి వెళ్లేవారు.
పక్కా ప్రణాళికతో..
పదిరోజుల క్రితం స్థానిక కర్నూలు మెడికల్ కాలేజి ఎదురుగా ఉండే బాలాజి మెడికల్స్‌లో కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అబిల్ అలీషేక్ కొన్ని ఫిజీషియన్ శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన సమాచారాన్ని బట్టి అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకున్నారు. ఈ మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మందులు కొనే ఆర్‌ఎంపీల అవతారం ఎత్తారు. శనివారం మధ్యాహ్నం దామోదర్‌కు ఫోన్ చేసి మందులు కావాలని కోరారు. దీంతో అతను నమ్మి సంపత్‌నగర్‌కు వచ్చి మందులు విక్రయించాడు. వెంటనే విషయం తెలిపి మందులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున 4 గంటల వరకు శ్యాంపిల్ మందుల పంచనామా చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 500 రకాల మాత్రలు, సిరప్‌లు, సోప్‌లు, పౌడర్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి.
శ్యాంపిళ్లు అమ్మే వైద్యులపై నిఘా..!
తమ వద్దకు చికిత్సకు వచ్చే రోగులకు మందుల కంపెనీలు ఇచ్చే ఫిజీషియన్ శ్యాంపిళ్లను వైద్యులు ఉచితంగా ఇవ్వాలి. కానీ కర్నూలు నగరంలో కొందరు వైద్యులు ఈ శ్యాంపిల్ మందులను సైతం రోగులకు అమ్ముకుంటున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలా శ్యాంపిళ్లు అమ్మే వైద్యులు, ఆర్‌ఎంపీలపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా రక్తాన్ని సేకరిస్తున్నారని, లైసెన్స్‌లు లేకుండా ఔషధ విక్రయాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి విషయాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు7382934390 అనే నెంబర్‌కు ఫోన్ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అబిద్ అలీ షేక్ తెలిపారు.