
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనంకూడా కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరొక బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం గురువారంరాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
మరోవైపు రాయలసీమపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంవల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని ఉరుములతో కూడినజల్లులు గాని కురిసే అవకాశముందని తెలిపింది.