
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి, కోస్తాంధ్రకు దగ్గరలో బంగాళాఖాతంలో యాంటీ సైక్లోన్ ఏర్పడటం... ఈ మూడు కారణాల వల్ల శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రామగుండంలో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది.
ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌ల్లో 39 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్నిచోట్లా రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 5 డిగ్రీలు అధికంగా 27 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డు అయింది. హకీంపేట, నిజామాబాద్‌ల్లో 4 డిగ్రీలు అధికంగా 25 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.