లక్కు.. ట్రిక్కు! | lucky dips make crore rupee fraud | Sakshi
Sakshi News home page

లక్కు.. ట్రిక్కు!

Published Sat, Mar 26 2016 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

లక్కు.. ట్రిక్కు!

లక్కు.. ట్రిక్కు!

  • కర్నూలులో జోరుగా లక్కీ డిప్
  • అనంతపురం నుంచి జిల్లాలోకి దుకాణం
  • పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదన
  • పోలీసులు, స్థానిక నాయకుల అండదండలు
  • నిలువునా మోసపోతున్న పేదలు

  • ఖరీదైన వస్తువులతో కూడిన బ్రోచర్.. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రచారం.. పేదలు, కూలీలు లక్ష్యంగా పైసా పెట్టుబడి లేని వ్యాపారం.. స్థానిక నేతలు, పోలీసుల అండదండలు.. జిల్లాలో లక్కీ డిప్ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. అనుమతి లేకపోయినా.. అడ్డంగా దోచుకుంటున్నా.. అడిగే నాథుడే కరువు. ఒకరికో.. ఇద్దరికో తప్పిస్తే.. అధిక శాతం సభ్యులకు మిగిలేది డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలే. ఈ మొత్తం వ్యవహారంలో నిర్వాహకులు వెనకేసుకుంటున్న మొత్తం ఏకంగా రూ.కోటిన్నర. లక్కంటే వీరిదే మరి.

    సాక్షి ప్రతినిధి, కర్నూలు:
    జిల్లాలో నిషేధిత లక్కీడీప్ మొదలయింది. అధికార పార్టీ నేతలు, స్థానిక పోలీసుల అండదండలతో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని రూ.6 వేలకే కారు, బైకు అని ఊరిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో దుకాణం బంద్ కాగా.. జిల్లాలో ఈ లక్కీడీప్ దుకాణం తెరిచినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.3 కోట్ల మేరకు వసూలు చేస్తున్న నిర్వాహకులు లక్కీ డీప్ బహుమతుల కోసం కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రూ.2 కోట్లలో రూ.50 లక్షల వరకు మాముళ్ల కోసం ఖర్చు చేస్తుండగా.. మిగిలిన కోటిన్నర సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. లక్కీడీప్‌ను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుండటంతో వీరి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది.

    లక్కీ డిప్ ఎలా నిర్వహిస్తారంటే..
    ఒక్కో లక్కీడిప్‌లో సుమారుగా 5 వేల మంది సభ్యులు ఉంటారు. ఒక్కో సభ్యుడు నెలకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.50 లక్షలు అవుతుందన్నమాట. ఈ విధంగాా ఆరు నెలల పాటు సభ్యుల నుంచి ఏకంగా రూ.3 కోట్లు వసూలవుతుంది. ప్రతి నెలా సభ్యులందరినీ సమావేశపరిచి.. లక్కీడీప్ తీస్తారు. ఇందులో మొదటి 50 మందికి బహుమతులను అందజేస్తారు. ఈ విధంగా 5 నెలల పాటు మొత్తం 250 మందికి బహుమతులను అందజేస్తారు. ఇందులోనూ సుమారు 10 మందికి ఖరీదైన కార్లు, బైకులు, టీవీలు వంటి బహుమతులను అందజేస్తారు. ఇక మిగిలిన సభ్యులకు కన్సొలేషన్ బహుమతుల కింద డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలు కట్టబెడతారు. మొత్తంగా వీటన్నింటికీ కలిపి అయ్యే ఖర్చు కేవలం కోటిన్నర మాత్రమే. అంటే ఈ వ్యాపారంలో ఏకంగా పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదిస్తున్నారన్నమాట.

    పోలీసులు, అధికారపార్టీ నేతల అండతోనే..
    లక్కీడిప్ కేంద్రాలు పోలీసులు, అధికారపార్టీనేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఎమ్మిగనూరు, బనగానపల్లె, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ లక్కీడీప్ నిర్వాహకులకు అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు పోలీసుల అండదండలు ఉంటున్నాయి. ఫలితంగా వీరు తమ వ్యాపారాన్ని దర్జాగా నిర్వ హిస్తున్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి కూలీనాలీ చేసుకున్న డబ్బులు కాస్తా పేదలు ఆశకు లోనై లక్కీడీప్ వ్యాపారంలో కోల్పోతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఒక లక్కీడీప్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇక మిగిలిన ప్రాంతాల్లో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement