మధుకరా.. ఎంత పనిచేశావురా..! | madhukar arrest | Sakshi
Sakshi News home page

మధుకరా.. ఎంత పనిచేశావురా..!

Feb 5 2017 12:22 AM | Updated on Aug 13 2018 3:11 PM

హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలతో దక్షిణాది రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

– 4 హత్యలు.. 3 హత్యాయత్నాలు
– పదుల సంఖ్యలో దోపిడీలు
– నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు
– చివరకు చిత్తూరు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం


చిత్తూరు (అర్బన్‌) / కదిరి/ అనంతపురం సెంట్రల్‌  : హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలతో దక్షిణాది రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేయడానికి వచ్చిన ఖాతాదారులపై దాడికి తెగబడి సంచలనం సృష్టించిన నిందితుడు కొండయ్యగారి మధుకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు, పదుల సంఖ్యలో దోపిడీలతో నేర చరిత కలిగిన మధుకర్‌రెడ్డి వివరాలిలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా.. ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లితండ్రులకు చెందిన ఓ ఇల్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు.

పోలీసులకు షాక్‌...
మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో జనవరి 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్‌ఐ తిప్పానాయక్‌ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు ఇతన్ని విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలియడంతో తేరుకోలేకపోయారు. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. ఇక హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. దీంతో పాటు పదుల సంఖ్యలో మధుకర్‌రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది.

మదనపల్లి పోలీసులను అభినందించిన ఎస్పీ
మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్‌ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్శింహులు, మొహీద్దీన్‌లను అభినందించారు. ఈ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మధుకర్‌ నేరాల్లో.. మచ్చుకు కొన్ని..
- బెంగుళూరు కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన బ్యాంక్‌ మేనేజర్‌ జ్యోతి ఉదయ్‌పై 2013 నవంబర్‌ 19న మధుకర్‌ కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
- 2013 నవంబర్‌ 11, 12 తేదీల్లో కదిరి ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఏటీఎం కేంద్రంలో రూ.3,700 డ్రా చేశారు.
- నవంబర్‌ 10వ తేదీన ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను చంపి, ఆమె నుంచి లాక్కున్న రెండు ఏటీఎం కార్డులతోనే కదిరిలో ఆ మరుసటి దినం ఉదయం 10.36 గంటలకు రూ.3,500, 12న ఉదయాన్నే 5.54 గంటలకు అదే ఏటీఎం సెంటర్లో ఒక సారి రూ.500, ఇంకోసారి రూ.200 డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను డ్రా చేసినది ఒకటి ఎస్‌బీఐ ఏటీఎం కార్డు కాగా.. మరొకటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement