నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం నల్లగొండ మండలం అన్నెపర్తి పరిధిలోని ఎంజీయూలో 6 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయాన్ని, రూ. 3.2 కోట్లతో సీసీ రోడ్లను, రూ.14 కోట్ల కోట్లతో నిర్మించే ఇంజనీరింగ్ కాలేజీకి, 7.5 కోట్లతో నిర్మించే పరీక్షల విభాగం భవనాలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
అన్ని యూనివర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలను నియమించామని పేర్కొన్నారు. ఉన్నత విద్యను విద్యార్థులకు మెరుగైన రీతిలో అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఎంజీయూ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్. భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్‌లు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు.
ఇరువర్గాల నినాదాలతో ఉద్రిక్తత
ఎంజీయూలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం శ్రీహరి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎంజీయూ గ్రంథాలయ ఆవరణలో టీఆర్‌ఎస్వీ వర్సెస్ కోమటిరెడ్డి అనుచరుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కోమటిరెడ్డి జిందాబాద్ అని ఆయన అనుచరులు నినాదాలు చేయగా ... దానికి ప్రతిగా సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి జిందాబాద్ అం టూ టీఆర్‌ఎస్వీ నాయకులు నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొని ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట మంత్రులతో కలిసి మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోమటిరెడ్డి ఆ తరువాత తన అనుచరులతో నడుచుకుంటూ వస్తుండగా ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇలా గ్రంథాలయం వరకు చేరుకునేసరికి అప్పటికే మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రంథాలయం ప్రారంభించి లోపలికి వెళ్లారు. కోమటిరెడ్డి గ్రంథాలయం వరకు వచ్చే ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో అక్కడే టీఆర్‌ఎస్వీ నాయకులు కోమటిరెడ్డి డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల నినాదాలతో ఎంజీయూ ఆవరణ మార్మోగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అక్కడే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఎంజీ యూ సమస్యలపై కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. మంత్రులు వెళ్లిన తరువాత సెమినార్ హాల్‌లో కోమటిరెడ్డి అనుచరులు మంత్రుల పేర్లతో ఉన్న ప్లెక్సీలను తొలగించారు.
బీసీ విద్యార్థి సంఘాల నాయకుల నిరసన
గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీలో టెట్ అర్హత లేకుండా అవకాశం కల్పించాలని, మార్కుల శాతం నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దాంతో వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎంజీయూలో సమస్యలపై పలు విద్యార్థి సంఘాలు వినతిపత్రాలు అందజేశారు. అన్నెపర్తి సర్పంచ్ పుష్పలత యూనిర్సిటీకి భూములు ఇచ్చిన వారికి ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయ భూములకు నష్ట పరిహారం ఇప్పించాలని డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు.
యూనివర్సిటీ అభివృద్ధికి కృషి
Published Mon, Feb 13 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
Advertisement