పుష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
పుష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
Published Mon, Aug 1 2016 12:58 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్):
పుష్కరాలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. పుష్కర విధులు నిర్వహించేవారు అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పుష్కర విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విపత్తుల నిర్వహణ నిపుణుడు, హైదరాబాద్ మానవ వనరుల అభివద్ధి సంస్థ ప్రతినిధి ప్రసన్నకుమార్ పుష్కరాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, విధులు నిర్వహించే అధికారులు వచ్చే ప్రతి ఒక్కరిని అథితిగా భావించి గౌరవించాలన్నారు. సంగమేశ్వరం మారుమూల ప్రాంతం అయినందున రహదారి సదుపాయం సరిగా లేకపోవడంతో మెటల్‌రోడ్డు నిర్మించామన్నారు. దారి పొడవున లైట్లు ఏర్పాటు చేయాలని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. శ్రీశైలానికి ప్రతి రోజు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున విధులు నిర్వహించే వారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఘాట్‌ల దగ్గర భక్తులకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయలు కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..ఘాట్ల దగ్గర ఎటువంటి షాపులు ఉండరాదన్నారు. షాపులు ఉంటే సమస్యలు తీవ్రంగా ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ఘాట్‌లకు దూరంగా షాపులు ఏర్పాటు చేసుకుంటే ప్రతి నాలుగైదు షాపులకు మధ్య ఖాలీ ఉంచాలన్నారు. విపత్తల నిర్వహణకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement