గేటు మీటింగ్‌లో మాట్లాడుతున్న కార్మిక సంఘం నాయకులు
కొత్తూరు: సెప్టెంబర్ 2వ తేదీన కార్మికుల సమస్యలపై పలు కార్మిక సంఘాల అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఇందులో భాగంగా పలు కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆదివారం కొత్తూరు పారిశ్రామికవాడ సమీపంలో కార్మికులతో కలిసి గేటు మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక చట్టాల సవరణ వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేçస్తూ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకొస్తున్నట్లు ఆరోపించారు. కార్మికవర్గానికి అన్యాయం చేసే మోదీ విధానాలను సమ్మెద్వార ఎండగట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా భూసేకరణ చట్టం ద్వార బలవంతంగా పేద రైతుల పొలాలను కార్పొరేట్ పరిశ్రమలకు ప్రభుత్వం అప్పగిస్తుందన్నారు. పేద రైతుల పొలాలను లాక్కోవడం, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యాక్షుడు పానుగంటి పర్వతాలు, సీఐటీయూ మండల కార్యదర్శి బీసా సాయిబాబా, నాట్కో కెమికల్ డివిజన్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్‌గౌడ్, నాట్కోఫార్మా ప్రధాన కార్యదర్శి మురహరిరెడ్డి, ఏకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.