మహమ్మారిపై సమరభేరి
మహమ్మారిపై సమరభేరి
Published Sat, Aug 27 2016 8:48 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
మలేరియా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ పూనిక
హోమియో ఔషధాలతో నిరోధానికి ప్రణాళిక
పైలట్ ప్రాజెక్టుగా ఏజెన్సీలో మూడు మండలాల్లో అమలు
అల్లు రామలింగయ్య కళాశాలకు నిర్వహణ బాధ్యత
సాక్షి, రాజమహేంద్రవరం :
జిల్లాలోని మన్యప్రాంతంలో ఏటా మలేరియా సోకి వందల మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతుండగా వారిలో ఎక్కువమంది చిన్నారులే. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రులు మలేరియా బాధితులతో కిటకిటలాడుతుంటాయి. జ్వరం తగ్గకపోవడంతో పలువురు కాకినాడ, రాజమహేంద్రవరంలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతూ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో మలేరియా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. వ్యాధి సోకకముందే హోమియోపతి మందులను (ప్రివెంటివ్ మెడిసిన్) ఇవ్వడం ద్వారా సమర్థంగా నియంత్రించవచ్చని భావించింది. ఏజెన్సీలో రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లోని 21 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆస్పత్రికి అప్పగించింది. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుంది. ఇందుకు ఏడాదికి రూ.50 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.1.5 కోట్లు కేంద్రం హోమియోపతి కళాశాల, ఆస్పత్రికి కేటాయించింది.
ప్రాజెక్టు అమలు ఇలా...
ఎంపిక చేసిన రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లోని 21 గ్రామాల్లో ఆస్పత్రి బృందం గత ఏప్రిల్ నుంచి ప్రతి రోజూ పర్యటిస్తోంది. జ్వరంతో బాధపడుతున్న గిరిజనుల రక్తనమూనాలకు సేకరించి పరీక్షిస్తోంది. మలేరియా బాధితులను గుర్తించి వ్యాధి తగ్గడానికి మందులు ఇస్తోంది. మిగిలిన వారికి మలేరియా రాకుండా ముందస్తుగా మందులు ఇస్తోంది. మలేరియా తగ్గడానికి నెలకు నాలుగుసార్లు చొప్పున మందులు అందిస్తోంది. మందులు వేసుకోవడంలో బాధితులు అలక్ష్యం వహించే అవకాశం ఉండడంతో ప్రతి గ్రామంలో ఒక వలంటీర్‌ను నియమించి, వారికి ప్రతి నెలా గౌరవవేతనం చెల్లిస్తోంది. వలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బాధితులకు మందులు ఇస్తున్నారు.
విజయవంతమైతే అన్ని ఏజెన్సీ గ్రామాల్లో అమలు
ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రతి వారం వలంటీర్లు గిరిజనులకు మందులు ఇస్తుండగా, వైద్యుల బృందం నెలకోసారి ప్రతి గ్రామంలో పర్యటిస్తోంది. మలేరియా బాధితులను పరీక్షించి వ్యాధి తగ్గిందా, లేదా అన్నది నిర్ధారిస్తోంది. వ్యాధి రాకుండా ముందస్తుగా మందులు వాడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ గ్రామాల్లో హోమియోపతి మందుల ద్వారా మలేరియాను నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది.
మంచి ఫలితాలు వస్తున్నాయి..
ఏజెన్సీ గ్రామాల్లో మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నాం. మందులను గిరిజనులకు కాకుండా వలంటీర్ల చేతికి ఇస్తున్నాం. వారు ప్రతి ఇంటికీ వెళ్లి స్వయంగా మందులు వేస్తున్నారు. జ్వర బాధితులు ముందస్తుగా మందులు వాడడం వల్ల మలేరియా రావడం లేదు. వెలగపల్లిలో ఏప్రిల్‌లో 108 మంది మలేరియా బాధితులు ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కొత్త కేసులు నమోదు కావడంలేదు. మంచి ఫలితాలు వస్తున్నాయి.
– వెన్నా వీరభద్రరావు, ప్రిన్సిపాల్, హోమియోపతి వైద్య కళాశాల
Advertisement