ఉనికిని కాపాడుకునేందుకే మావోల దుశ్చర్యలు
Published Fri, Aug 19 2016 9:32 PM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
చింతూరు :
ఉనికిని కాపాడుకునేందుకే మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చింతూరు ఓఎస్డీ డాక్టర్ కె.ఫకీరప్ప శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేగ గ్రామస్తులపై మావోయిస్టులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజనులను పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీంచి వారిపై మావోయిస్టులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. గిరిజనులను పోలీసులు ఎప్పుడూ ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగించలేదన్నారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానం ఉందనే విషయం మావోయిస్టులు తెలుసుకోవాలన్నారు. గంజాయి రవాణాదారులు, కలప స్మగ్లర్ల వద్ద డబ్బులు వసూలు చేసే మావోయిస్టులు ఏజెన్సీలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆదివాసీలను పోలీసు ఇన్‌ఫార్మర్లుగా అనుమానించటం మావోయిస్టుల పిరికిపంద చర్య అన్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్న వారి వివరాలు తమవద్ద ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి పోలీసులు కృషి చేస్తున్నారని, గిరిజనులకు అన్నివేళలా అండగా ఉంటామని ఓఎస్డీ తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలను ప్రజలు ప్రతిఘటించాలని ఆయన కోరారు.
Advertisement