చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన బేల్దారి చంద్రశేఖర్ (48) ఆదివారం స్వగ్రామం నుంచి లేపాక్షి వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్నాడు.
లేపాక్షి : చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన బేల్దారి చంద్రశేఖర్ (48) ఆదివారం స్వగ్రామం నుంచి లేపాక్షి వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్నాడు. లేపాక్షి నంది విగ్రహం వెనుక వైపునకు వచ్చే సరికి ఎదురుగా హిందూపురం నుంచి గోరంట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జెడ్ 5224) వస్తోంది. అదే సమయంలో మరో ద్విచక్రవాహనదారుడు అతివేగంతో వెళ్తున్నాడు. అతడిని తప్పించడానికి ఆర్టీసీ డ్రైవర్ ప్రయత్నిస్తుండగానే చంద్రశేఖర్ ద్విచక్రవాహనం బస్సుకు తగిలి వెనుకచక్రం కింద పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఇక తమకు దిక్కు ఎవరని కుటుంబ సభ్యులు విలపించారు. లేపాక్షి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను హిందూపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గోపినాథ్, స్థానిక కంట్రోలర్ ఆర్‌ఎస్‌కే బాషా ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాల గురించి ఎస్‌ఐ శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు.