సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద వాహనాలను గుద్దుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి నాలుగు వాహనాలను, ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఓ పాదచారి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు... మియాపూర్ డిపో–2 ఆర్టీసీ బస్సు(రూట్ నంబర్ 10జే) జేఎన్‌టీయూ నుంచి సికింద్రాబాద్‌కు వస్తోంది. బస్సు క్లాక్‌టవర్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద మెట్రో పిల్లర్ నంబర్ 14 వద్దకు రాగానే అదుపు తప్పి పాదచారిని ఢీ కొట్టింది. వెంటనే డ్రైవర్ అహ్మద్ బ్రేకులు వేసేందుకు యత్నించినా బస్సు అలాగే ముందుకు వెళ్లి 16–17 పిల్లర్ల మధ్య డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు మరోవైపు వచ్చింది. అక్కడి నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్లి కారు, ఆటోలు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లి పిల్లర్ 24ను ఢీకొట్టి ఆగిపోయింది.
ఒకరు మృతి– ముగ్గురికి గాయాలు
పిల్లర్ 14 వద్ద ఓ యాచకుడి(51)ని బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఒంగోలుకు చెందిన ప్రసాద్, పద్మజారాణి డ్రైవర్ వెంకటేశ్‌తో కలసి కారులో అమీర్‌పేట్ వైపు వెళుతుండగా బస్సు రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు వీరికి గాయాలుకాలేదు. దాని వెనుకాలే ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. దీంతో బోయిన్‌పల్లి సిక్‌విలేజ్‌కి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మేడ్చల్ కండ్లకోయకు చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస్ సికింద్రాబాద్‌కు వచ్చి వెళుతుండగా ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వెళ్తున్న ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన డి.ధనమ్మ(45)ను ఢీ కొట్టడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 2015లో బీహెచ్‌ఈఎల్ డిపోలో పనిచేసే సమయంలోనే ఆర్‌సీ పురం వద్ద ఓ పాదచారిని అహ్మద్ నడుపుతున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీంతో యాజమాన్యం 14 నెలల పాటు అహ్మద్‌ను సస్పెండ్ చేసింది. మళ్లీ విధుల్లో చేరిన కొద్ది నెలల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
బస్సు కండీషన్‌లోనే ఉంది: ఆర్‌ఎం రమాకాంత్ (సికింద్రాబాద్)
బస్సును మా నిపుణులు వచ్చి పరిశీలించారు. బస్సు బ్రేక్ మీటర్‌లో ఎయిర్ 6 పాయింట్లు చూపిస్తోంది. అంటే.. బ్రేకు బాగున్నట్లే. ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందనేది తర్వాత దర్యాప్తులో తేలుతుంది. ఫిట్‌నెస్ బాగానే ఉంది. డిసెంబర్ 27, 28వ తేదీల్లో బస్సు పూర్తిస్థాయి సర్వీసింగ్ చేశాం. ఎలాంటి లోటుపాట్లు లేవు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం. గాయపడినవారికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం.
బ్రేకులు పడలేదు: డ్రైవర్ అహ్మద్
క్లాక్‌టవర్ చౌరస్తాకు రాగానే పాదచారి వచ్చాడు. బస్సు బ్రేకులు వేసేందుకు యత్నిం చినా ఆగలేదు. బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. అందరూ కేకలు వేస్తున్నారు. నేను సీటులోంచి లేచి నిల్చుని బ్రేకులు ఒత్తిపట్టినా పడలేదు. ముందుకు వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment