నమ్మినందుకు "గోవిందా"
- ఉద్యోగాలు, అధిక వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి..
- కోట్లలో వసూలు చేసి ఉడాయించిన ఘనుడు
అనంతపురం సెంట్రల్ : ఉద్యోగాలు, అధిక వడ్డీ చెల్లిస్తానంటూ ఎరవేశాడు. కోట్ల్లలో వసూలు చేశాడు. చివరకు తనను నమ్మిన ప్రజల నెత్తిన టోపీ పెట్టి ఉడాయించాడు. ఇది ఓ ఘరానా మోసగాడి ఉదంతం. విశ్వసనీయ సమాచారం మేరకు... అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను, అధిక వడ్డీ చెల్లిస్తానంటూ ప్రజలను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన వందలాది మంది ఎగబడి డబ్బులు కట్టారు. ఆ విధంగా రూ.3 కోట్ల వరకు డబ్బులు వచ్చిపడ్డాయి. ఇక ఏం చేయాలో తెలియక రాత్రికి రాత్రే ఊరు వదిలాడు.
వికలత్వం+మాలధారణే ఆయుధం
వికలాంగుడైన గోవిందరాజులు మాలధారణలో ఎక్కువగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ నమ్మారు. అందరికీ నమ్మకస్తునిగా చెలామణి కూడా అయ్యాడు. అంతే అందరికీ టోపీ పెట్టేశాడు. రాత్రికి రాత్రి ఉడాయించాడు. అయితే ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తం ఇంకా ఎక్కువే అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఎన్ని కోట్లల్లో మోసం చేశాడనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు. అయితే ఘటనపై నాల్గవ పట్టణ పోలీసులు పరిశీలిస్తున్నారు.