తండ్రిని కొట్టి తల్లీకూతుళ్లపై అత్యాచారం..
* వారిద్దరితోపాటు కుటుంబ యజమానిపైనా హత్యాయత్నం
* కోమాలోకి బాలిక తల్లిదండ్రులు కామాంధుడి ఘాతుకం
* పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ సంఘటన
ద్వారకాతిరుమల : అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వారిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవ దహనం చేసేందుకు యత్నించాడు.ఇది చూసిన ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయింది. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ హనుమాన్లగూడెంలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్లగూడెంలోని ఒక పొలంలో శక్కాబత్తుల రాంబాబు భార్య సుమలత, ఇద్దరు కుమార్తెలతో కలసి నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వచ్చిన దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి బాలకృష్ణ రైతు రాంబాబుతో స్నేహంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో సహకరిస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం తోటలోని సొరకాయలను కోసి భీమడోలు మార్కెట్‌లో విక్రయించేందుకు మోపెడ్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం బాలకృష్ణను వారి బంధువుల ఇంటి వద్దకు చేర్చిన రాంబాబు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. రాత్రి రాంబాబు ఇంటికి వచ్చిన బాలకృష్ణ.. ఇంటి వెనుక గొర్రెలకు మేత వేస్తున్న రాంబాబుపై వెనుక నుంచి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు.
ఈ గొడవకు బయటకు వచ్చిన అతని భార్యను ఒక రాయితో కొట్టాడు. రాంబాబు దాడితో భార్యాభర్తలిరువురూ స్పృహ కోల్పోగా సుమలతపై అత్యాచారం చేశాడు. అప్పటికి నిద్రలేచిన 13 ఏళ్ల వయస్సుగల రాంబాబు కుమార్తెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టివేసి గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో పడవేశాడు. అనంతరం ఇంటిలోకి ప్రవేశించి గ్యాస్‌ను వదిలి నిప్పంటించి ఇంటిని సైతం దగ్ధం చేశాడు. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు.
ఇదంతా చూసిన 11 ఏళ్ల ఆ బాలిక చెల్లెలు అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లో ఉన్న గడ్డివాములో దాక్కొంది. గురువారం మంటలను ఆర్పే సమయంలో ఆమెను గుర్తించిన బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు. స్పృహ కోల్పోయిన రాంబాబు దంపతులను స్థానికులు 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. 30 శాతం కాలిన గాయాలతో బాలిక ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలిని పరిశీలించింది. డీఎస్పీ సరిత మాట్లాడుతూ.. నిందితుడిని గుర్తించామని, తాగుడుకు బానిసై ఉన్మాదిగా మారిన ఇతనిపై తల్లితండ్రులు సైతం గతంలో దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఆమె వెంట దెందులూరు ఎస్సై సుభాష్ తదితరులున్నారు.