చంద్రబాబును నమ్మి మోసపోయా | man suicide attempt in chittoor district | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నమ్మి మోసపోయా

Published Fri, Mar 18 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

చంద్రబాబును నమ్మి మోసపోయా

చంద్రబాబును నమ్మి మోసపోయా

తిరుపతిలో యువ న్యాయవాది ఆత్మహత్యాయత్నం

తిరుపతి : ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా. ఇంటికొక ఉద్యోగమిస్తా. ఉద్యోగం వచ్చేవరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తా’’ అని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బాబు వచ్చాడు.. జాబు వస్తుందన్న ఆశతో రెండేళ్లుగా ఎదురుచూసి.. చూసి.. విసిగి వేసారిపోయిన తిరుపతికి చెందిన యువ న్యాయవాది పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) గురువారం మరుగుదొడ్లను శుభ్రం చేసే ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్‌లో బాబును నమ్మినందుకు తమ కుటుంబం పూర్తిగా నష్టపోయిందని పేర్కొన్నాడు. తమ కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని వాపోయాడు. ఒకపక్క చదువులకోసం అప్పులు చేసి, ఉద్యోగాలు రాక.. మరొకపక్క చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో చనిపోతున్నానని పేర్కొన్నాడు.
 
పూర్వాపరాలివీ...

తిరుపతిలోని బాలాజీ కాలనీ, ఆంధ్రాబ్యాంక్ వద్ద నివాసముంటున్న పోతులూరి మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా(30) భార్య శ్రావణితోపాటు చెల్లెళ్లు రెడ్డిలక్ష్మి, సునీత, తమ్ముళ్లు సిద్ధయ్య, వెంకటరమణయ్య, చిన్నాన్న కుమార్తె రాధ, బావమరిది వెంకటేష్‌తో కలసి నివాసముంటున్నాడు. తమ కుటుంబసభ్యుల చదువులకోసం వడ్డీ వ్యాపారుల వద్ద రెండేళ్లక్రితం అప్పు చేశాడు. ఉద్యోగం వస్తే అప్పు తీర్చివేయవచ్చని భావించాడు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారం నేపథ్యంలో ఉద్యోగంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేకపోవడం..  నిరుద్యోగ భృతి కింద రూ.రెండువేలు ఇస్తామన్న హామీని సైతం తుంగంలో తొక్కేయడంతో మాసుమయ్య ఖిన్నుడయ్యాడు. అదే సమయంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడం, అవి చెల్లించలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో మనస్థాపానికి గురైన మాసుమయ్య గురువారం ఓ సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు యత్నించాడు. ‘హార్పిక్ ’ యాసిడ్‌ను తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు మాసుమయ్యను రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
 
బాబు మోసం చేశారు..

 అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా ముంచారంటూ బాధితుడు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మోసం చేశారు. ఎక్కడా నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. ఒకపక్క రైతుల ఆత్మహత్యలు, మరోపక్క నిరుద్యోగులు ఉన్నత చదువులు చదువుకొని ఏమిచేయాలో తెలియక దొంగలుగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఆకలికి అలమటిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీన్ని చూసి నేనొక న్యాయవాదిగా తట్టుకోలేకపోతున్నాను. మా కుటుంబంలో సుమారు పదిమంది బీటెక్, బీఎస్సీ, బీఈడీ, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ లాంటి ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ప్రైవేటు, కాంట్రాక్టు ఉద్యోగాల్లో సరైన జీతాల్లేవు. కనీసం పదివేల రూపాయలు కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వోద్యోగం ఉంటేనే ఏదైనా లోను ఇస్తామని బ్యాంక్‌వారు అంటున్నారు. చంద్రబాబును నమ్మినందుకు మా కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఒకపక్క చదువులకు అప్పులు చేసి ఉద్యోగాలు రాక, మరోపక్క వడ్డీలు కట్టలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో చనిపోతున్నాను’’ అని మాసుమయ్య అందు లో తెలిపాడు. తాను గతంలో పలు ఉద్యమాలు చేశానని, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు ప్రయత్నం కూడా చేశానని నోట్‌లో ఆయన గుర్తు చేశాడు. ‘జగనన్నా.. మీరైనా ఈ దేశాన్ని కాపాడండి. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నివారించండి. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయించండి. ఉద్యోగ భద్రత కల్పించండి’ అని నోట్‌లో మాసుమయ్య విజ్ఞప్తి చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement