మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం
అవనిగడ్డ :
దివంగత మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను మూడు రంగాల్లోని ప్రముఖులకు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అందజేశారు. స్థానిక గాంధీ క్షేత్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సినీగేయ రచయిత భువనచంద్ర, అంతర్జాతీయ చిత్రకారుడు ఎస్‌వీ రామారావు, ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డికి మండల వెంకటకృష్ణారావు స్మారక పురస్కారాలను బుద్ధప్రసాద్ అందజేశారు. సినీగేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ 1977 దివిసీమ ఉప్పెన సమయంలో తాను మిలటరీలో ఉన్నానని, ఆ నాటి ఘోరకలికి కకావికలమైన దివిసీమను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు మండలి వెంకటకృష్ణారావు ఎంతో శ్రమించారన్నారు. తెలుగుభాషాభివృద్ధికి వెంకటకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని, ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఊపిరున్నంతకాలం చిత్రకళను కొనసాగి స్తానని చిత్రకారుడు ఎస్‌వీ రామారావు చెప్పారు. ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూదివిసీమ దేవాలయాలపై తీసిన లఘు చిత్రం దివి దర్శిని ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. తొలుత మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి ప్రముఖులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ముగ్గురు పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించారు. కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.