ఎంపీ కృషి తోనే మంత్రాలయం రైల్వే లైన్ రీసర్వే
Published Sat, Feb 4 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
– వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్ రీసర్వేకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కృషి వల్లే సాధ్యమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక రాయల్ ఫంక‌్షన్ హాల్‌లోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి రైల్వే లైన్ రీసర్వే ముఖ్యమంత్రి కృషి వల్లే జరిగిందన్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2015 అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడిన అంశాన్ని తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపారనేది సత్య దూరమన్నారు. 2010లో సర్వే చేసినప్పుడు ఫిజిబిలిటీ లేదనే నివేదిక కేంద్రానికి అందిందన్నారు. అయితే మంత్రాలయం రూట్‌లో ట్రాఫిక్ పెరగడంతో పాటు భక్తుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో రైల్వే లైన్ వేయాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక 2014 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రధానికీ విన్నవించారన్నారు. త్వరలో రూ.280 కోట్లతో రైల్వే కోచ్ రిపేరీ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కానుందన్నారు.
మనకు రావాల్సిన వాటా ఎందుకు అడగరు..
తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీటి వాటాను ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గానీ, టీడీపీ నాయకులు గానీ బళ్లారికి పోయి ఎందుకు అడగడం లేదని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. అలాంటప్పుడు మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్ రీసర్వే తామే చేయించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే కర్ణాటక ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు జరుపలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement