మాజీలకు గన్‌మెన్ల తొలగింపు | removing gunmen to Ex-MLA and Ex-MP | Sakshi
Sakshi News home page

మాజీలకు గన్‌మెన్ల తొలగింపు

Published Thu, Aug 14 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

removing gunmen to Ex-MLA and Ex-MP

కర్నూలు: జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గన్‌మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం జిల్లా పోలీస్ అధికారులకు చేరాయి. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి 3+3, రాష్ట్ర మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి,  మీనాక్షి నాయుడు, నీరజారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులకు 2 + 2, కోట్ల సుజాతమ్మకు 1+1 గన్‌మెన్లను కేటాయించి భద్రత కల్పిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 36 మంది నేతలకు 160 మందికి పైగా గన్‌మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మినహా మాజీలందరికీ గన్‌మెన్లను తొలగించాలని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తితో పాటు శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి యాదవ్ ప్రస్తుతం అత్యధిక గన్‌మెన్లతో భద్రతను పొందుతున్నారు.

 మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌కు గతంలో 2+2 గన్‌మెన్లు ఉండగా 1+1కు తగ్గించారు. ప్రత్యర్థుల నుంచి తనకు హాని ఉందని పోలీస్ శాఖకు విన్నవించుకున్న నేపథ్యంలో గన్‌మెన్లను కొనసాగించేందుకు పై స్థాయి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మాజీలందరికీ గన్‌మెన్లను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వుల మేరకు 1, 2 రోజుల్లో నోటీసులు జారీ చేసి భద్రతను తొలగించనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో నంద్యాల శాసనసభ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డికి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు 3+2 గన్‌మెన్లతో భద్రత కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలకు 1+1, ఎంపీలకు 2+2 గన్‌మెన్లతో భద్రతను కొనసాగించనున్నారు. అయితే ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించుకుని పెయిడ్ గన్‌మెన్లను పొందిన వారికి కూడా తొలగించాలని హోంశాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో ఆ మేరకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement