ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో మావోయిస్టులు దండకారణ్యంలోని సుక్మా, కాంకేర్ జిల్లాల్లో మూడుచోట్ల జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు చనిపోయారు.
చింతూరు (పశ్చిమ గోదావరి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో మావోయిస్టులు దండకారణ్యంలోని సుక్మా, కాంకేర్ జిల్లాల్లో మూడుచోట్ల జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు చనిపోయారు. సుక్మా జిల్లా కిష్టారం వద్ద జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు, కుంట సమీపంలో జరిపిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా తాజాగా శనివారం కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్-122వ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పఖంజూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఛోటేబేటియా అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో బేచా గ్రామ సమీపంలో తారసపడిన మావోయిస్టులతో జవాన్లకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్ తరలిస్తుండగా విజయ్‌కుమార్, రాకేష్ అనే జవాన్లు మృతి చెందారు. రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో జవాను చనిపోయాడు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బిజాపూర్ జిల్లాలో శనివారం ఓ యాత్రికుల బస్సును దహనం చేసిన మావోయిస్టులు సుక్మా జిల్లా భెర్జీ వద్ద ఓ ఆటోను కూడా తగులబెట్టారు.