
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్రిపల్లె(చాపాడు): సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కదా బాగా చూసుకుంటాడని తమ ఒక్కగానొక్క కూతురిని రూ.2లక్షలు నగదు, 10 తులాల బంగారం ఇచ్చి వివాహం జరిపిస్తే.. కట్న పిశాచిగా మారిన అల్లుడు తమ బిడ్డను వేధించి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన గవిరెడ్డి బాలిరెడ్డి కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.
చాపాడు మండలంలోని బద్రిపల్లెకు చెందిన గవిరెడ్డి బాలిరెడ్డి కూతురు యోగీశ్వరి(23) ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బెంగళూరులోని తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్టుకున్న భర్తే తన కూతురిని కట్నం కోసం హత్య చేశాడని మృతురాలి తండ్రి బాలిరెడ్డి బెంగళూరులోని కేఆర్ పురం పోలీస స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బద్రిపల్లెకు చెందిన యోగీశ్వరికి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డితో 2014 ఏప్రిల్‌లో వివాహమైంది. కట్న కానుకల కింద 10 తులాల బంగారం, రూ.2లక్షల నగదు, ఎకరం పొలం ఇచ్చారు. ఇందులో పొలం బద్రిపల్లెలోనే ఉంది. వివాహమైనప్పటి నుంచి బెంగళూరులోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం యోగీశ్వరి బంగారం మొత్తాన్ని భర్త అమ్మేశాడు. అప్పటి నుంచి భార్యా భర్తల నడుమ మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో తన భార్యకు రావాల్సిన విలువైన పొలంపై కన్నేసిన మహేశ్వర్‌రెడ్డి తనకు కట్నం కింద ఇస్తామన్న ఎకరా పొలంను రాయించుకుని రావాలని యోగీశ్వరిపై ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడిన యోగిశ్వరి పొలం రాసివ్వాలని, తనపై వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. నీకిస్తామన్న భూమి తప్పకుండా ఇస్తామని సంక్రాంతి పండుగకు ఇక్కడికి వచ్చినప్పుడు రాసిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. చెప్పిన రెండు గంటల్లోనే రాత్రి 9గంటలకు యోగీశ్వరి ఆత్మహత్య చేసుకుందని ఫోను వచ్చింది. హుటా హుటిన బెంగళూరుకు వెళ్లి చూడగా, యోగీశ్వరి మెడపై గొంతు నులిమిన కాట్లు ఉన్నాయని, తమ అల్లుడే యోగీశ్వరీని చంపేసి ఫ్యానుకు ఉరివేసినట్లు చిత్రీకరించాడని బాలిరెడ్డితో పాటు గ్రామస్తులు వాపోయారు. ఏడాదిన్నర్ర కుమారుడి భవిష్యత్తు కూడా చూడకుండా ఇలా కర్కోటకుడిగా మారి డబ్బుల వ్యామోహంతో తమ గ్రామ ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నాడని బద్రిపల్లె గ్రామస్తులు భగ్గుమంటున్నారు. ఇలాంటి దుస్థితి ఏ ఆడకూతురుకు రాకూడదని, హత్య చేసిన మహేశ్వర్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని యోగీశ్వరీ కుటుంబీకులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అక్కడి కేఆర్ పురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.